పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాత్రిభోజన సదుపాయం

తెల్లవారిన తరువాత తెలుగుదేశపు విద్యార్థులు తఱచుగా నివసించే నారద ఘట్టానికి" వారివారి సహాయంమీద వెళ్లగలిగితిమి. ఆ ఘట్టానికి వెళ్లేవరకే మాకు అయోమయంగా వున్నదిగాని, వెళ్లింది మొదలు అందఱూ స్వదేశీయులే కనుక స్వదేశములో వున్నట్లే వున్నది. వెళ్లిన మఱునాడే నాకు రాత్రిభోజనం కూడా కుదిరింది. కాశీలో పూర్వం చదువుకొన్న మహాపండితులందఱున్నూ వంటిపూట తిని చదువుకొన్న వారే. అనేక సత్రాలు వున్నాయిగాని, ఆయా సత్రాల్లో వకపూట మాత్రమే పగలు పెడతారు. రాత్రి శుద్ధశూన్యమే. అయితే గోధుమ రొట్టెలు వేయడం ఆచారం గనుక, ఆ రొట్టెలు అలవాటయి పడడం మొదలుపెడితే రాత్రికి ఆకలే వెయ్యదనిన్నీ అందుచేతనే వత్సరాల కొలది పూర్వం పండితులు యేకభుక్తంతోవుండి చదువుకోగల్గినారనిన్నీ చెప్పగా విన్నాను. దానికి తథ్యంగా ఇంకొక్కటికూడా మా గురువుగారు చెప్పేవారు. మంథెన్న ఘనాపాఠీలు" ముఖ్యంగా యాచనే జీవనంగా కలవారు; ఆ కారణంచే తఱచు పరవాసం చేస్తూవుంటారు. పరవాసానికి బయలుదేరింది మొదలు మళ్లాయింటికి వెళ్లేవరకున్ను ఏకభుక్తమే చేస్తారు. ఆ కారణం చేతనే పరవాసంలో వారి ఆరోగ్యం చెడకుండా వుంటుంది. అని గురువుగారు చెప్పగా వింటిని. ఇది నిజమే కావచ్చును. కాని నాకు మాత్రం వెళ్లిన మఱునాడే రాత్రి భోజనం కుదిరింది గాని, లేనిచే నేనచ్చట వుండనే లేకపోదును. ఈ రాత్రిభోజన సదుపాయం ఇటీవల తెలుగు విద్యార్థులకు మాత్రమే కాకినాడ కాపురస్థుడు శ్రీ పైడా వెంకన్నగారు ప్రతి