Jump to content

పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నముతో పనే లేకపోయింది. జగ్గయ్యపేటలో కోమట్లు చాలా ధర్మపరులు కలరని మా గురువుగారు అప్పుడప్పుడు ప్రస్తావించుచుండగా వినివుండడం చేత ఆ వూరికి వెళ్లడం తటస్థించింది. తదనుగుణంగా, ఆ వూల్లో శ్రీరామ రాజన్న అనే వైశ్యవృద్దుడు మాచే పురాణం చెప్పించి వక వారంరోజులాపి తగుమాత్రంగా మమ్మును సన్మానించాడు. అటనుండి మళ్లీ రైలుస్టేషనుకు బోనగల్లు వెళ్లునపుడు త్రోవలో మక్కపేటలో నీలకంఠయ్యగారు అనే ఒక రాజయోగిని సందర్శించితిమి. ఆయన బ్రాహ్మణుడేకాడని కొందఱు, బ్రాహ్మణుడేయని కొందరు ఇటీవల తగవులాటలు పెట్టుకొని ఒకరి నొకరు వెలివేసి కొన్నట్లు పిమ్మట వింటిమి కాని, ఆయన జాతికి యెవరైననూ సిద్ధపురుషుడనుటలో సందేహం మాత్రం లేదు. ఆయనకూడా మమ్మల్ని సమ్మానించాడు. పిమ్మట సికింద్రాబాదులో దిగినాము. రాత్రి తొమ్మిదిగంటలవేళ దిగినప్పటికి, స్వగృహమునకు వెళ్లినప్పటికంటే అనేకరెట్లు అధికముగా వేడినీళ్లు స్నానము లోనైన ఉపచారాలతో పుచ్చా లక్ష్మయ్య గారు ఆతిథ్యమిచ్చారు. ఆ నిరతాన్నదాత గృహమునందే మటి వారం రోజులు ఆ ಏಟ್ಟಣಂ చూస్తూ ఆగినాము. వెళ్లేటప్పుడు ఆ గృహస్టు నాకు వారింట్లో యెప్పటినుంచో నిలవవున్న సిద్ధాంత కౌముదిని కూడా యిచ్చినాడు. అక్కడ రైలెక్కి వాడీ స్టేషనులోనున్నూ మళ్లా ధోండు, జబ్బలపూరు స్టేషనులోనున్నూదిగి, మహారాష్ట్రుల హోటలులో భోంచేసి, అటు పిమ్మట ప్రయాగలో దిగి, త్రివేణీసంగమ స్నానం చేసికొని, ఆనాడే రాత్రి సుమారు పన్నెండుగంటలవేళ కాశీలో దిగినాము. ఎవరో రైలులో కలిగిన