నా కుంకుమ బొట్టుకు జంకియో, యేమోగాని, నాకన్న ననేకరెట్లు గొప్పవారా సభలో నుండిన్నీ నాయెదుటికివచ్చి వకరేనా కూర్చోలేదు. అపుడు కూడావున్న కృష్ణశాస్త్రిగారే శాస్తార్థం చేశారు. తక్కిన పద్యాలు వగయిరాలు అన్నీ యథోచితంగా చెప్పితినిగాని, అందొక లోటు చేశాను. ఎనమండుగురినీ కూర్చో పెట్టి పద్యాలు చెప్పుటకు బదులు, ఒక్కరినే కూర్చోపెట్టి ఒకటి అయిన తరువాత వేటొకటిగా ఎనిమిది పద్యాలు మాత్రం చెప్పి ముగించాను. ఇందులో ధారణ కష్టం లేదు. సభ్యులు ఈ రహస్యం కనిపెట్టినట్లు లేదు. ఈ సభనాటికి ఈ యవధానములను గూర్చి లోకులంతగా యెఱుగరు. కాబట్టి, మేము ఆడినదాట పాడినదిపాటగా సాగింది. గుర్వనుగ్రహమున సమస్తమున్నూ సమకూరుతుంది. సభ్యులు సంతసించారు. రామదాసుగారు సంతసించారు. మా కాశీ ప్రయాణమును గూడ రామదాసుగారికి దెల్ఫితిమి. ఇరువురికిన్నీ యెంత ఖర్చగునో రమారమిగా అంతయు రామదాసుగారు మాకు బహుమానంగా యిచ్చారు.
కాశీ ప్రవేశం
అటనుండి గుండుగొలను గ్రామం వెళ్లితిమి. అక్కడ కూడ చిన్నసభ జరిగినట్లు జ్ఞాపకము. అటనుండి ఏలూరుద్వారా బెజవాడకు వెళ్లి అట రైలెక్కినాము. బోనగల్లు స్టేషనులో దిగి వత్సవాయి గ్రామంద్వారా జగ్గయ్యపేటకు వెళ్లితిమి. వత్సవాయిలో నొకరోజు ఆగితిమి. అక్కడ జొన్నన్నమును భుజింపవలసి వచ్చెను. ఆ కారణముచే, వకపూటే గాని రెండోపూట భోజ