చేతనైనంతలో నాలుగు పద్యాలు చెప్పి వూరుకోరాదా, అంటే, అంతమాత్రానికి కాశీప్రయాణానికి సరిపడ్డ ద్రవ్యం వూడిపడుతుందా? పడదు. అందుకోసం జపం ప్రారంభించాను. కూడా వున్న కృష్ణశాస్త్రిగారికీ కవిత్వప్రవేశం లేదు. లేకపోయినా, నాకంటే ఆయన సభకు తగిన లక్షణాలు తేజస్సు వగయిరా కలవాడు. వ్యాకరణం చదువుచున్నాడు. స్మిత పూర్వాభిభాషి. జాతకభాగంలో చక్కని ప్రవేశం కలదు. అంతకుముందే నా జాతకం చూచి “నీది సభలలో పేరుపొందే జాతకమయ్యా" అని చెప్పేవాడు. నాడు కూడా ఆ మాటలే చెపుతూ నాకు ప్రోత్సాహం కలిగించాడు కాని, పిఱికిమందు మాత్రం పోయలేదు.
నేను అదే దీక్షగా గాయత్రీజపం సాగించి అందఱున్నూ మళ్లు గట్టుకొని భోజనాలకు వెళ్లేవేళకు సుమారు మూడు గంటలు దాటే వేళకు ముగించాను. ఇరువురము ఆ అలవేళ (సాయంకాల సమయం) ఆ సంతర్పణలో భోజనం చేశాము. భోజనానంతరం ఆయన బ్రాహ్మణాశీర్వచనం పుచ్చుకొనే సమయంలో మా ప్రస్తావన వచ్చింది. అప్పుడు ఆ రామదాసుగారు సభాస్తారులైన పండితులను, “అయ్యా, ఈరాత్రి వీరెవ్వరో కవీశ్వరులు సభ చేస్తారు కాబట్టి, మీరందఱున్నూ ఆగి రేపట దయచేయవలసిందని కోరారు. 'ఇంతకన్నా వుందా, అని ఆయా పండితులు ఆమోదించారు. పెద్ద కుంకుమబొట్టుతో నేను సభలో కూర్చుని అవధానమునకు మొదలుపెట్టి "అయ్యా? మీలో నెవరేనా శాస్తార్ధానకు’ వకరు దయచేయవలసిందని వినయంగానే కోరితినిగాని,