ఖర్చున్నూ ఆయనే యివ్వవచ్చును. ఈవేళ తప్పితే ఈ పండితవర్గము ఇక్కడ తటస్థింపదు అని, మాకు వూహ కలిగింది. మా వూహకు అనుగుణంగా ఆ ఠాణా వుద్యోగసులు ఆ రామదాసుగారితో చెప్పి అనుసంధానం చేస్తామన్నారు.
మొదటి అష్టావధానం
ఇది అంతా అయేటప్పటికి సుమారు జామున్నర ప్రొద్దు ఎక్కింది. ఆ వేళ వూల్లో అందఱూ అక్కడికే భోజనానికి వెడతారు. కాబట్టి ఎక్కడా వంటలు లేవు. ఏనాలుగు గంటలకో అయిదు గంటలకో మేముకూడా ఆ సంతర్పణలోనే భోజనం చేయాలి. ఈలోగా చేసే పనేమిటి? సభలో చేసే కార్యానికి తగు కట్టుబాట్లు చేసికోవాలి. కాబట్టి ఇద్దరమున్నూ గ్రామానికి సమీపంలో వుండే ఒక పొలంలో నీరు తోడుకొనే యేతం గుంటలో స్నానం చేసికొన్నాము. నేను చిత్తెకాగ్రతకోసం గాయత్రీ జపానికి మొదలు పెట్టాను. ఆ సభలో వట్టి కవిత్వంకాక అష్టావధానం చేదామని నాకుతూహలం. అయితే యింతవఱకెవరేనా చేస్తూ వుండగా దానిని చూడనూలేదు, నేను చేయనూ లేదు. వారు చేశారు, వీరు చేశారని వినడం మాత్రం కలదు". దానివల్ల నేమి తెలుస్తుంది? ఇప్పుడు క్రొత్తగా మొదలు పెట్టాలి. దాని విధానంకూడా తెలియదు. కవిత్వం మట్టుకు అప్పుడప్పుడు పాఠశాలల్లో చదువుకొనే విద్యార్థులను కూర్చోపెట్టి వారివారి కోరిక ననుసరించి చెప్పుట కలదు. ఇట్టిస్థితిలో పెద్దసభలో అవధానం చేయడమంటే మాటలా? పోనీ, యెవరు చేయమన్నారు, ఏదో