వీలుకాదు. ఈ సందర్భములో మనకు విద్యావిఘ్నమెట్లున్నూ తప్పదు. కాబట్టి కాశీకి వెళుదుమా' అని యొకరితో నొకరము యోజించుకొనుచున్నాము. యోజించుకోవడమే తడవుగా, “శుభస్యశీఘ్రం" కనుక, తప్పక నేడే వెడదామని కూడా నిశ్చయించుకొన్నాము. త్రోవఖర్చులకు నీవద్ద నేమున్నదంటే నీవద్దనేమున్న దని ప్రశ్నించుకోవడములో, నా వద్ద మూడు డబ్బులున్నూ ఆయనవద్ద ఆఱు అణాలున్నూ" నిలువ తేలింది. బెజవాడనుండి కాశీకి మనిషి వక్కంటికి పద్దెన్మిది రూపాయిలు సమారు టిక్కెట్టుకు కావలెను గదా? "యెట్లాగంటే యెట్లాగ" అని అనుకొని "బెజవాడ వెళ్లేలోపున సంపాదించలేక పోతామా" అని ధైర్యం తెచ్చుకొన్నాము.
కవిత్వపు గడబిడ
స్నానమైంది. ఎట్లో తొందరగా భోజనమున్నూ చేశాము. ఎండగండినుండి బయలుదేరి ఉందుఱు గ్రామము వెళ్లి ధాన్యం వసూలు చేసి ఆ బస్తాలు తిరుపతిశాస్త్రి గారింటికి చేర్చే ఉపాయం చేసి, ఆ మఱునాడు కాశీప్రయాణపు సన్నాహంతో ఆ సమీపమున నున్న గణపవరం వెళ్లినాము. కాశీప్రయాణానికని చెప్పలేదు గాని యేదో కొంత యాచన కారంభించినాము. ఏమిన్నీ పలికినట్లు జ్ఞాపకంలేదు. ఆ వూళ్ళో ఒక సాహిత్య పండితుడు వుండగా, ఆ రోజున వారింట్లో భోజనం చేశాము. ఆయనే కాకుండా, ఆయన ధర్మపత్ని కూడా సాహిత్యపరురాలు. ఈ విషయము కడు మృగ్యమగుటచే, ఆ పుణ్యదంపతుల దర్శనము మాకొక విధ