వారి దర్శనం నిమిత్తం వెళ్లారు. అట్టి సమయంలో గెద్దనాపల్లి నుండి వచ్చిన యిరువురిలో పండితుడని యింతకుముం దుదహరించిన వేంకటకృష్ణ శాస్త్రి గారు నన్ను ఏవో కొన్ని ప్రశ్నలు వ్యాకరణంలో అడిగారు. నాకు తోచిన సమాధానాలు చెప్పి అంతతో వూరకుండక నేను ఆయన్నీ మళ్లా ప్రశ్నించడానికి మొదలుపెట్టినాను. అది గురువుగారు అంగీకరించక, "అబ్బాయీ! ఆయన నీకన్న సర్వాత్మనా పెద్దలు, నీవు ఆయనను ప్రశ్నించకూడదు," అని నన్ను గట్టిగా మందలించారు. విద్యార్థి అవస్థలో నుండుటచే నేను “వారి పెద్దఱికమునకు నేనేమి లోటు గలిగించాను. నన్ను వారడిగారు, నాకు తోచినవి చెప్పినాను, నేను మళ్లా అడిగాను” అనియొక మోస్తరు వినయముగా గురువుగారికి ఉత్తరము చెప్పినాను. అంతతో ప్రస్తుత విషయము ఎట్లో ఆగింది.
నన్ను ప్రశ్నించిన పండితుడున్నూ, నాకు కాబోయే మామగారున్నూ ఆ రోజు అక్కడనే ఉండిపోయిరి; పిమ్మట జామురాత్రి తెల్లవారువేళ మా గురువుగారితో నన్ను గూర్చి కాబోయే మామగారు ముక్తసరిగా ఈక్రింది మాటలను మాట్లాడినారు. “మీరు నా కొమార్తెను మీ బావమఱదికి ఇమ్మని ఇదివఱలో నాతో చెప్పుతున్నారు. ఆ వరుడు వయస్సులో కొంత ముదురు. అందుచేత నాకు సంశయముగా వుంది. ఈవేళ నాతో వచ్చిన వేంకట కృష్ణయ్య శాస్తులుగారితో ప్రసంగించిన పిల్లవాని కివ్వవలెనని నాకు వుద్దేశము హఠాత్తుగా కలిగింది. నగలు వగయిరాలతో నాకేమి పనిలేదు. ఎట్లో బొమ్మల పెండ్లి మోస్తరుగా