పుట:Kasi Yatra Chellapilla Venkatasastry.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కోవాలి. ఇట్లుండగా గురువుగారు కిర్లంపూడి వార్షికానికి బయలుదేరినారు. అక్కడ జమీందారులు వార్షికము అరవై రూపాయిలున్నూ ఇచ్చినారు. వారిని సొమ్ము అడిగి పుచ్చుకొని, స్వగ్రామము వెళ్లివస్తానని మనవిచేసి, కాశీకి వెడదామని ఆలోచించుకొని, విరోధి సంl (క్రీ.శ 1889) మార్గశీర్షశుద్ధ తదియనాడు ముహూర్తము బాగున్నదని మనసులో పెట్టుకొని వున్నాను. సొమ్ము అడగడమే తరువాయి గాని, వారు ఇవ్వడానికి లేశమున్నూ అభ్యంతరము లేదు. అంతలో ఆ గ్రామంలో వుండగానే నాకు పెండ్లి తటస్థించి ఆ ప్రయాణ ముహూర్తము పెండ్లి ముహూర్తంగా పరిణమించింది. దాని సందర్భం టూకీగా వ్రాస్తాను.

పెండ్లి మాటలు

కిర్లంపూడికి సమీపములో - గెద్దనాపల్లి అనే పల్లెటూరిలో శ్రీ శాస్రులవారి అన్నగారి అల్లుడు రామడుగుల వేంకటాచలముగారు స్కూల్ మాస్టరుగా ఉన్నారు. సమీపమగుటచే కిర్లంపూడికి ఆయన పినమామగారి దర్శనానికి వచ్చారు. ఆయనతో సుప్రసిద్దులు నూకల సోమనాథ శాస్త్రులు గారి కుమారుడు వేదశాస్త్ర పండితుడు వేంకట కృష్ణశాస్త్రిగారుకూడా అప్పుడు అత్తవారింటికి వచ్చియుండుటచే గెద్దనాపల్లి నుండి శాస్రులవారి దర్శనానికి వచ్చారు. వారిరువురున్నూ శ్రీవారి దర్శనానికి వచ్చే సమయానికి, శాస్రులవారి సన్నిధిని నేను తప్ప ఇతర విద్యార్ధులెవ్వరున్నూ లేరు. తక్కిన విద్యార్థులందఱున్నూ ఆ సమీపంలోనే వున్న ధర్మవరపు పాఠశాలా పండితులగు తనికెళ్ల నరసింహశాస్తుల