పుట:Kashi-Majili-Kathalu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

కాదంబరి

మధురికా! కిన్నరమిథునములను సంగీతశాలల విడువుము.

అట్టి వినోదసంభాషణములన్నియు నాలింపుచుఁ గ్రమంబునఁ బోయి కాదంబరీ భవనసమీపమును జేరిరి. అందు సేవార్థమై యరుదెంచి యుభయపార్శ్వముల వసించియున్న యన్నుమిన్నల మణికనక విభూషణకిరణ జాలంబులు నదీ ప్రవాహమువలె వ్యాపించుచుండెను. దివ్యరూపసంపన్నులగు గంధర్వ కన్యకలు మండలముగాఁ జుట్టునుం బరివేష్టించి కూర్చుండ దివ్యమణిప్రభాధగద్దగితమగు శ్రీమంటప మధ్యంబున నీలాంశుక విరచితంబగు హంసతూలికాతల్పంబునఁ దెల్లనితలగడపైఁ జేతులాని మహావరాహ దంష్ట్రావలంబిత యగు భూదేవివలె నొప్పుచు దేహప్రభాజాలజలంబు పెచ్చుపెరుగ భుజలతా విక్షేప పరిభ్రమణములచే విదలించుచుండిరో యనఁ జామరగ్రాహిణు లిరువంక వీచుచుండ నొయారముగాఁ బండుకొని సఖులతో ముచ్చటింపుచుఁ బర్యంకము దాపున నేలం గూర్చుండి కేయూరకుఁడను వీణావాహకుఁడు మహాశ్వేతయొద్దకు వెళ్ళివచ్చిన వత౯మానములం జెప్పుచుండ నచ్చెరువుతో నాలింపుచున్న కాదంబరీతరుణీలలామంబు చంద్రాపీడునకు నేత్రపర్వము గావించినది.

భూలోకములో మహాసుందరులని పేరు పొందిన యిందుముఖులు గంధర్వకన్యలకు దాస్యము సేయఁబనికిరారు. అట్టి గంధర్వ కాంతలలో నిరుపమానసౌందర్యశాలిని యని ప్రఖ్యాతి వడసి గంధర్వకుల చక్రవర్తి కూఁతురై నిరతిశయభాగ్యవైభవంబులఁ బ్రకాశించు కాదంబరి నా దివ్యస్త్రీల నడుమఁ గనకమణి శ్రీమంటపమధ్యమున హతాత్తుగాఁ జూచినంతఁ జంద్రాపీడుని హృదయ మెట్లుండునో వ్రాయుట దుర్ఘటము. తద్భూషణమణి కిరణజాలంబులు కన్నులకు మిరిమిట్లు గొలుప విభ్రాంతుండై యొక్కింతతడవేమియుం దెలియక మోహముతోనుండి యంతలోఁ దెప్పిరిల్లి ఆహా! నాకన్ను