పుట:Kashi-Majili-Kathalu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మంగళాచరణము

చ. నిరతము లోకసంతతి జనింపఁగ వర్థిల ద్రుంగహేతువై
    నిరుపమనిత్యపూర్ణ శుభనిర్మల సచ్చిదనంతమూర్తియై
    గురుతర యోగదూరుల కగోచరమై గుణరూపశూన్యమై
    పరఁగెడు నాత్మతత్త్వమును భక్తి భజింతు నభేదబుద్ధితోన్.


సీ. ఆసించునే శక్తి యనుకంప జనియింపఁ
             జతురాసనాది నిర్జర గణంబు
    గురునిష్ఠ నేదేవి చరణము ల్భజియించి
            స్థిరకీర్తి వడసెఁ గౌశికమహర్షి
    మూఁడుకన్నులు గల్గు మోములైదైదు వ
            న్నెలనొప్పునే మహనీయ రుచికి
    దివ్యసాథనముల దీపించునే యంబ
            పతిచేతు లురువర ప్రదము లగుచు

     విప్రజనముల పాలింటి వేల్పుగిడ్డి
     రమణ నిరువదినాల్గువర్ణముల మనువు
     మనుచు నెద్దేవి యవ్వేద మాత మాత
     నభి నుతించెద గాయత్రి నాత్మ నెపుడు.

క. మోదం బలరఁగ నీ దగు
    పాదంబుల నమ్మి భక్తి పరతంత్రుఁడనై
    కాదంబరిఁ దెనిగింపం
    గాఁ దొడఁగితి వేదమాతృకా ! ప్రోవఁగదే.