పుట:Kashi-Majili-Kathalu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

77


నిర్వృతి యెట్లుగలుగును? సంభోగమెట్లు రుచ్యమగును? పెక్కేల నవ్వుసైతము వచ్చునా?

క్రూరుఁడగు మన్మధుఁడు నిన్నిట్టి యవస్థ నొందజేసెనే? అట్టి కాముని సకామునిగా నెట్లుచేయుదును? పద్మినులు దివసకరాస్తమయ విధురములగుచుండ సహవాస పరిచయంబునం జేసి చక్రవాకయువతి సైతము సమాగమసుఖమును విడుచుచున్న దే? నీయందలిప్రేముడిచేఁ గుమారికాజన విరుద్ధమగు స్వాతంత్ర్యమంగీకరించితిని. గురువచనము తిరస్కరించితిని. లోకాపవాదము గణింపనైతిని. స్త్రీలకు మండన మగు సిగ్గు విడిచితిని. ఇప్పుడు తిరిగి యెట్లు స్వీకరింతును?

అంజలిఘటించి ప్రార్థించుచున్నదాన, నన్ననుగ్రహింపుము. నాజీవితముతోడనే నీవు వనములోఁ బ్రవేశించితివి. కోపముసేయక యీవిషయము నన్నెప్పుడు మందలింపవలదు. నాచిత్తము మరలదు. అని చెప్పి కేయూరకుఁ డూరకుండెను.

ఆతనిమాటలు విని మహాశ్వేత గొంచెముసేపాలోచించి తల యూచుచుఁ గానిమ్ము. కేయూరక! నీవు బొమ్ము. నేను వచ్చి పరిశీలించెద నని పలికి యతని నంపి చంద్రాపీడునింజూచి, రాజపుత్రా! కింపురుష రాజధానియైన హేమకూటమున కిప్పుడు బోవలసియున్నది. అదియు నిచ్చటికి దాపుగనే యుండును. అదృష్టపూర్వములగు పట్టణవిశేషములం జూడ వేడుక గలిగియున్నచోఁ జూచి వత్తువు కాని రమ్ము. మద్విశిష్ట యగు కాదంబరిని సైతము చిత్తవిభ్రమమునుండి తొలగింపనగు నొక దివసమేయుండి పోవచ్చును. అకారణబంధుండనగు నిన్నుఁ జూచినదిమొదలు నాహృదయ పరితాప మొకింత తొలంగినది. సజ్జనసమాగమము శోకమును బోగొట్టును కదా! మీవంటివారు పరులకు సుఖముగలుగుటయే చింతించుచుందురని బలికిన విని చంద్రాపీడుఁ డచ్చేడియ కిట్లనియె.