పుట:Kashi-Majili-Kathalu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

76

కాదంబరి


గానకెంత చింతించుచుండునో పత్రలేఖ యేమనుకొనునో రాజపుత్రు లేమందురో యని ధ్యానించుచునే నిద్రబోయెను.

నిశావసానంబున మేల్కాంచి మహాశ్వేతయు నారాజపుత్రుఁడును కాలకృత్యములు నిర్వర్తించిరి. ఇంతలో మనోహరమైన వేషముతో గేయూరకుఁడను గంధర్వకుమారునితోగూడఁ దరళిక యచ్చటికి వచ్చినది. ఆప్రాంతమందుఁ గూర్చునియున్న రాజపుత్రునింజూచి యాతరళిక విస్మయమందుచుఁ దదీయరూప మక్షులం గ్రోలుచున్నట్లు సవిత్కరముగా జూచిచూచి తల యూచుచుఁ బిమ్మట మహాశ్వేత యొద్దకుఁబోయి నమస్కరించి తదీయ జపావసానమువరకుఁ దాపున గూర్చుండెను.

మహాశ్వేతయు జపము ముగించినవెనుక తరళికంజూచి, బోటీ కాదంబరి సుఖముగా నున్నదా? నామాటలం జెప్పితివా? యేమన్నది? సమ్మతించెనా? యని యడిగిన విని యవ్వనితయు వినయముతో శిరమువంచి రాజపుత్రీ! నేనువోయి కాదంబరిని జూచితిని. ఆమె సుఖముగా నున్నది. నాసందేశమంతయు వినిపించితిని. కన్నీరు గార్చుచుఁ గేయూరకుఁడను తన వీణావాహకుని కెద్దియో చెప్పి యిచ్చటికంపినది. సర్వము నతండె నివేదించునని పలికి యూరకుండెను.

అప్పుడు కేయూరకుఁడు లేచి నమస్కరించుచు దేవి! మా రాజపుత్రి నీకిట్లు విజ్ఞాపనజేయు మని నన్నంపినది. వయస్యా! ఇప్పుడు తరళిక చెప్పిన మాటలన్నియు వింటిని. నా చిత్తమును బరీక్షించుటకో లేక గృహవాసాపరాధమును గురించి నిపుణముగా నధిక్షేపించుటయో, స్నేహపరిత్యాగమో కాక కోపమో కాని యిట్టివాత౯ నంపుట నాకు మిక్కిలి వ్యసనముగా నున్నది. మిత్రురాలు చింతించుచు నటవిఁ గ్రుమ్మరుచు వ్రతములఁ గృశించి కష్టముల ననుభవింపుచుండ నాకు ఆహా! సుఖమెట్లనుభవింపనగును?