పుట:Kashi-Majili-Kathalu.pdf/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10]

పుండరీకుని కథ

73

చుండుట వినియుండలేదా? అదియునుంగాక భగవతిచే స్వయముగానే పునస్సమాగమ సూచకమగు వచనము వినఁబడినది కాదా? ఆమాట వితధమెట్లగును? నిస్సంశయముగా నమ్మహానుభావుండు తిరుగా సురలోకమునుండి రాగలఁడు. మహాత్ముల ప్రభావమచింత్యమైనది. పరలోకమునకేగి మరల వచ్చిన చరిత్రలు పెక్కు మనము పురాణముల వినుచున్నవారము. పుండరీకిండు నట్లు రావచ్చును. రాకున్నను నేమిచేయగలము? ఎవ్వరి నిందింపము? విధిబలవంతమైనది. దైవ హతకుని విలాసము లతిపిశునములు. ఆయతస్వభావములు దుఃఖములు. అనాయత స్వభావభంగురములు సుఖములు. ఒకజన్మము నందు సమాగమము, జన్మాంతర సహస్రములయందు విరహము గలుగుచుండును. ఆత్మను నిందించుకొనరాదు. సంసారమే యతి గహనమైనది. దీని ధీరులుగాని దాటలేరుకదా!

అని యిట్లు మృదువులైన సాంత్వన వచనములచే నామె నోదార్చుచుఁ జంద్రాపీడుఁడు వెండియు నిఝు౯ర జలంబుదెచ్చి బలాత్కారముగా నశ్రుజలకలుషితమగు నామె మొగమును గడిగించెను.

అంతలో మహాశ్వేత వృత్తాంతమును వినుటచే శోకించువాఁడుంబలె దివసవ్యాపారము విడిచి రవి యధోముఖుం డయ్యెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు గోపా! యిప్పుడు వేళ యతిక్రమించినది. తర్వాతివృత్తాంతము విస్తారముగా నున్నయది కావున ముందటిమజిలీలో దర్వాతికథ జెప్పెద నిప్పుడు లేచి కట్టెలం దెమ్ము. వంటఁజేసికొని భుజింతమని పలికి యెట్ట కేలకు వాని సమాధానపరచి యట్లు కావించెను.

మఱియు నయ్యతీశ్వరుని వెంట గావడి మోచుకొని నడుచుచు వాఁడు నడుమ నడుమ అయ్యా! అమ్మహాశ్వేతతోఁ బుండరీకుఁడు వెండియు గలిసికొనునా? చంద్రాపీడుఁడు తరువాత నేమిచేసెను?