పుట:Kashi-Majili-Kathalu.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

72

కాదంబరి

నావృత్తాంత మని పలికి యక్కలికి వల్కలోపాంతభాగంబున మోముదమ్మిం గప్పికొనుచు దుర్నివారమైన బాష్పవేగము నద్దుకొనుచు నుచ్చస్వరముతో నేడువఁదొడంగినది.

చంద్రాపీడుఁడు తదీయ వృత్తాంతమంతయు విని యా కృతజ్ఞతావిశేషమున కత్యంతము సంతోషింపుచు మెల్లగా నిట్లనియె. భగవతీ! క్లేశభీరుఁడు నకృతజ్ఞుడు నగు జనుండు స్నేహసదృశమైన కార్యమును జేయలేక నిష్ఫలమైన యశ్రుపాతమాత్రముచేతనే మైత్రిం బ్రకటించుకొనును.

అట్లుకాక క్రియచేతనే కృతజ్ఞతను వెల్లడించెడి నీవును నిట్లు నిందించుకొనియెద వేటికి? అతని నిమిత్తము మహైశ్వర్య సుఖములన్నియుఁదృణముగానెంచి విడిచితివి! తల్లిదండ్రులకెడమైతివి. వనితాజనదుష్కరము లగు నియమములచే గాయమును గ్లేశపరచుచుంటివి.

ఇదియునుంగాక శోకాభిభూతులచేత నాత్మ యనాయాసముగా వినబడుచున్నది. అతిప్రయత్నమున గాని క్లేశముల యందుంచబడదు. మరణమనునది యపండితులు గావింపుచుందురు. తండ్రిగాని, తల్లిగాని, భర్తగాని, మిత్రుఁడుగాని మృతినొందినపుడు తానును మృతినొందుటకంటె యవివేకములేదు. దీనివలన వాని కేమైన నుపకారము జరుగునా? తిరుగాఁ దీసికొనివచ్చునా? పరలోకసౌఖ్య మిచ్చునా? దర్శన మిచ్చునా? యేమియుం జరుగదు. ఆత్మహత్యా పాతకమొండుమాత్రము వేధించి నిరయమునొందఁజేయును.

బ్రతికియుండి జలాంజలిదానాది విధులచే నుపకృతి జేయ వచ్చును. రతీదేవి వృత్తాంతము స్మరించుకొనుము. ప్రియుండు హరనయన హుతాశనదగ్థుండైనను దాను మృతినొందక వేరొకరీతి నాతని పొందు గలిగియున్నది. మఱియుం బెక్కండ్రు కాంతలు ప్రియులు లోకాంతరగతులైననుఁ బ్రాణములువిడువక నిలిచియుండి సుఖించు