పుట:Kashi-Majili-Kathalu.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

కాదంబరి


సమాగమముకాగలదు. అని తండ్రివలె నన్నోదార్చి యతండు పుండరీక శరీరముతోఁగూడ గగనతలమున కెగసి యరుగుచుండెను.

అప్పుడు నేను భయవిస్మయ కౌతుకంబులు చిత్తంబుత్తలపెట్టఁ దలపై కెత్తిచూచుచు, ఆర్యా! ఇదియేమి యద్భుతమో చెప్పుమని కపింజలు నడిగితిని.

అతండు నాకేమియుఁ బ్రత్యుత్తర మియ్యకయే తొందరగా లేచి అంతకా! దురాత్మా! నామిత్రు నెచ్చటికిఁ దీసికొనిపోవుచున్న వాఁడవని యలుకతోఁ బలుకుచు, నుత్తరీయవల్కలము నడుమునకు బిగించి యమ్మహాపురుషుననుగమించి యంతరిక్షమున కెగసెను. మేము చూచుచుండగనే వారునక్షత్రమండలములలోఁ బ్రవేశించి యంతర్థానము నొందిరి.

ప్రియతమ మరణంబునం బోలెఁ గపింజలుగమనంబున శోకం బిబ్బడింప నాహృదయం బప్పుడు ఖేదిల్లినది. అప్పుడు కింకర్తవ్యతా మూఢత్వంబునం దరళికంజూచి, యోసీ! ఇప్పుడు నా కేమియుం దెలియకున్నది, యెఱింగితివేని నీవు నాకుఁ దెల్లముగా వక్కాణింపుమని యడిగిన నదియు మదీయమరణమున సహింపక నాకిట్లనియె.

దేవి! పాపాత్మురాల నా కేమియుం దెలియదు. ఐనను నీ దివ్యపురుషుఁడు నున్నుఁ దయతోఁ దండ్రియుంబోలె నోదార్చుటఁ జూడమిక్కిలి వింతగానున్నది. ఆలోచింప నసత్యముగానిట్లు పలుకుట కేమియుఁగారణము గన్పడదు. కావున నిప్పుడు ప్రాణపరిత్యాగ వ్యవసాయమునుండి మరలుటయే యుత్తమము. ఆపురుషుఁ ననుసరించి కపింజలుఁడుగూడఁ బోయెనుగదా! అతనికట్లు పలుకుట కేమి యవసరమో యించుక యాలోచింపుము. మరణమున కేమి తొందర పిమ్మట బొందవచ్చును. కపింజలుఁడు మరల వచ్చువరకైనఁ