పుట:Kashi-Majili-Kathalu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

69

జేసినది. ఇఁకపైనఁ జెప్పకుము, విరమింపుము, నేను సైతము వినఁజాలకున్నాను. గతించినవైనను సుహృజ్జనదుఃఖములు స్మరించినప్పుడు అనుభవ సమమగు వేదనం గలుగజేయునుగదా. అతిప్రయత్నముతో ధరించిన యీప్రాణముల శోకానములకు నింధనములుఁ జేయకు మని పలికిన విని యక్కలికయు నిట్టూర్పు నిగిడింపుచుఁ గన్నుల నశ్రువులు గారుచుండ విషాదముగా నిట్లనియె.

రాజపుత్రా! అట్టిదారుణ శోకసమయమందే విడువని యీ కృపణప్రాణములు నన్నిప్పుడేలవిడుచును? నిక్కము, పాపాత్మురాలనగు నాకంతకుఁడు సైతము దర్శన మీయవెరచు చున్నాడు. కఠినాత్మురాలనగు నాకిప్పుడీ శోకమేమిటికో? ఇదిశోకమా? అళీకము, సిగ్గు లేనివారలలో నేను మొదటిదానను. వజ్రమయమగు హృదయముతో నట్టిదుఃఖ మనుభవించితిని. కాని యనుభూతమయినదానిం చెప్పిన నేమిలెక్క యున్నది. తదనంతరవృత్తాంత మాకర్ణింపుము.

నేనట్లు పెక్కు తెరంగులఁ బలవరింపుచుఁ దరళికం జూచి, బోటీ! ఇఁక నాజీవితమేటికి? జింతయేమిటికి? చితి రచింపుము, అగ్నింబడి ప్రాణేశ్వరుం గలిసికొందునని పలికితిని.

అట్టి సమయమున నంతరిక్షమున జంద్రమండలము నుండి వెల్వడి యమృత డిండీరపాండురమగు నుత్తరీయాంశుకము అంసదేశమున వ్రేల మనోహరాలంకారభూషితుండైఁ మహాపురుష లక్షణోపేతుండై దివ్యాకృతితో నొప్పు నొక్క మహానుభావుడు ధవళదేహ ప్రభావితానములు దిగంతముల వ్యాపింపమెల్లన నచ్చటికి వచ్చి అతి శీతల స్పర్శములుగల నంగుళులతో నొప్పు నైరావతకరపీపరములగు బాహువులచే నందు గతాసుఁడై పడియున్న పుండరీకుని దేహము నెత్తుచు నన్నుద్దేశించి దుందుభినాదగంభీరమగు స్వరముతో వత్సా! మహాశ్వేఅత! నీవిప్పుడు ప్రాణములు విడువకుము. నీకితనితో వెండియు