పుట:Kashi-Majili-Kathalu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకునిచే శపింపఁబడి చందృఁడు చంద్రాపీడుఁడై పుట్టెను. చంద్రాపీడుఁడు అట్లు ప్రాణములు విడిచి శూద్రకమహారాజై యుదయించి రాజ్యమేలుచుండెను. చంద్రునిచే శపింపఁబడిన పుండరీకుఁడు రెండవజన్మమునందు వైశంపాయనుఁడై మూడవజన్మమునందు మహాశ్వేతచే శపింపఁబడి చిలుకయై యుదయించి జాబాలి యను మహర్షి యాశ్రమమున జాతిస్మృతిగలిగి మహాశ్వేతయొద్దకుఁ బోవుచుండ నతనిదుర్వృత్తి వారించుటకై వానితల్లి లక్ష్మి మాతంగకన్యక రూపమున వెలసి యాచిలుకం బట్టి తెప్పించి యనుతాపము గలుగఁ జేసి శాపావసానమున శూద్రకునియొద్ద కా చిలుకను దీసికొనివచ్చి యప్పగించినది. ఆరాజు చిలుకవలనఁ దమప్రాక్తన జన్మకథయంతయు విని విరాళిజెందుచుఁ జిలుకతోఁగూడ నాదేహము విడిచెను. అక్కడఁ జంద్రాపీడుఁడు జీవించి లేచి కాదంబరిం గౌఁగలించుకొనియెను. పుండరీకుఁడును గపింజలుని కేలుపట్టుకొని మహాశ్వేతకడకు వచ్చెను. తరువాత మహాశ్వేతను బుండరీకుడును గాదంబరినిఁ జంద్రాపీడుడును బెండ్లియాడి దివ్యభోగము లనుభవించిరి. ఇదియే కథావిధానము. ఇందలి తప్పుల మన్నించి యొప్పుల గ్రహింప సజ్జనులు ప్రార్థితులు.

ఉ. రెండవ కూర్పునం దనుసరించి మదీయ తృతీయ జాయధీ
    మండన రాజ్యలక్ష్మి యసమాన కథా విభవాభిరామమై
    యుండిన దీని నిప్డు సమయోచిత రీతులఁ బెంపుసేయఁ బా
    గుండు నటంచుఁ దెల్పె నుపయుక్తముగా నిది యట్లు చేసితిన్.

ఇట్లు,

మధిర సుబ్బన్న దీక్షితకవి.

రాజమండ్రి,

24 - 11 - 1922.