పుట:Kashi-Majili-Kathalu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

60

కాదంబరి

నొక్కమాటు వ్యర్థమయినదే అయ్యారే! ఎంతచిత్రము. ఈతండు పిన్ననాటనుండియు ధీరస్వభావుండు. అస్ఖలితచిత్తవృత్తిగలవాఁడై మాబోటులకు సైతము నీతి కరవుచుండువాఁడు. అట్టివాఁ డిప్పుడితరుండువోలే జ్ఞానము లెక్క సేయక తపఃప్రభావము నున్మూలించి గాంభీర్యాదిగుణంబులు మట్టుపరచి మన్మధునిచేత జడీకృతుండయ్యె. కానిమ్ము. ఇది యౌవనమహిమకదా యని తలంచుచు నేను మెల్లగా వాని దాపునకుఁబోయి యా శిలాతలమందు వెనుకగాఁ గూర్చుండి భుజముమీఁద జేయి వై చుచు సఖా! పుండరీక! ఇట్లుంటివేమని యడిగితిని.

అప్పు డతం డతిప్రయత్నముతోఁ గన్నులు దెరచి మందరమగు దృష్టితో నన్నుఁజూచి ఇస్సురని నిట్టూర్పు నిగుడించుచు సిగ్గుచేత విరాళాక్షరములు గలుగు మాటలతో వయస్యా? కపింజలా? నావృత్తాంతమెరింగియు నీ విట్లడిగిన నే నేమి చెప్పుదునని మెల్లగాఁ బలికెను.

అప్పు డతని యవస్థ జూచి త్రిప్పరానిదని నిశ్చయించియు మిత్రుని సన్మార్గప్రవృత్తునిగాఁ జేయుట యుచితము, శక్తికొలది చెప్పి చూచెదంగాక యని తలంచి వెండియు నిట్లంటిని.

పుండరీక! నీవృత్తాంతమెఱుంగబట్టియే యిట్లడుగుచున్నవాఁడ. నీవవలంబించిన వ్యాపారము గురూపదిష్టమా, శాస్త్రపఠితమా, నియమవిశేషమా, ముక్తిప్రాప్తికారణమా, మనస్సుచేతనయిన స్మరింపఁ దగినదేమో చెప్పుము. అజ్ఞానుండులోలె, మన్మధహతకునిచేతఁ బరిహాసాస్పదత్వమును బొందింపఁ బడుచుఁ దెలియకుంటివేమి? ప్రాకృత జనాభి మతములగు నింద్రియవిషయంబుల సుఖాభిలాష నీకెట్లు కలిగినది. పరిణయవిరసంబులగు నింద్రియసుఖంబుల బుద్ధిజొనుపుట మహారత్నమును భ్రాంతితో నంగారము ముట్టినట్లగునని యెఱుఁగవో?