పుట:Kashi-Majili-Kathalu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

59

పుష్పములు కోయుట మాని మఱియొకచోటికిం బోయితిని. పిమ్మట నీవు నింటికిఁ బోయితివికదా! అప్పుడు నే నితండొక్కండు నేమిచేయుచున్నవాఁడో చూతమని మరలివచ్చి యచ్చటి కొమ్మలసందున డాగి యాప్రదేశమును జూచితిని కాని యంతండందు గనంబడ లేదు.

మే మిరువురము పుట్టిననాఁటనుండియు నొకక్షణమైన నెడఁబాసి యుండలేదు. కావున సుహృత్స్నేహతరత్వంబున హృదయంబు దొట్రుపడుచుండ నిట్లు తలంచితిని.

అయ్యో! నామిత్రుఁడు మదనపరాయత్తచిత్తుండై యామత్త కాశిని వెంటఁబోయి తిరిగి నాయొద్దకు వచ్చుటకు సిగ్గుపడియెఁగాఁబోలు, లేక కోపముచేత నన్నువిడిచి యెచ్చటికేనింబోయెనేమో! ధైర్యస్ఖలనవిలక్షణుఁడైన యతం డేమైపోయెనోకదా యని యమంగళము తలంచుకొనుచుఁ దరులతాగహనములు, చందనవీధులు, లతామంటపములు, సరఃకూలములు మొదలగు ప్రదేశములు పెద్దతడవు తద్దయు శ్రద్ధతో వెదకినది.

అంత నొకసరస్సమీపమందు లతామంటపమున చిత్తరువు మాడ్కి స్తంభితునిపగిది యోగస్థునిభంగి కదలక మన్మధశాప భయంబునఁబోలె నణఁగి నిష్పందనిమీలితమగు కందోయినుండి బాష్పజలము ధారగా వెడలుచుండ హృదయమునఁ బ్రజ్వరిల్లు మదనాగ్ని జ్వాలను గైకొని వెడలు నిట్టూర్పు గాడ్పులచేఁ బ్రాంతలతాకుసుమ కేసరముల వాడఁజేయుచు వామకరతలంబునఁగపోలం బిడుకొని యున్మత్తునిక్రియఁ బరాయత్త చిత్తుండై యున్న పుండరీకుం గంటిని.

అపగతనిమేషము లగు చక్షుస్సులచేఁ దదవస్థ యంతయుం జూచి హృదయంబున విషాదంబు జనింప నిట్లు తలంచితిని.

మన్మధుఁడు దుర్విషహవేగముగలవాఁడు కదా! నిమిషములో నితనిదీర్ప రానియవస్థ పాలుచేసెను. అన్నన్నా! జ్ఞానరాసియంతయు