పుట:Kashi-Majili-Kathalu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేయూరకుఁడను తన వీణావాహకు నంపినది. ఆ వార్తవిని చంద్రాపీడుఁడు పత్రలేఖతోఁగూడ నమ్మరునాఁడు కాదంబరియొద్ద కరిగెను.

నాఁడుగూడ వారిభావములు సిగ్గుచే నొండొరులకుఁ దెల్లమైనవికావు పత్రలేఖ నందుంచి చంద్రాపీడుఁడు తనస్కంధావారమునకుఁ బోయెను. అప్పుడే తనతండ్రియొద్దనుంచి వచ్చినయుత్తరము జూచి తత్తరముతో మేఘనాధుఁడను సేనాధిపతి నందుండి పత్రలేఖను వచ్చినతరువాతఁ తీసికొనిరమ్మనిచెప్పి కాదంబరికొక యుత్తరము వ్రాసియిచ్చి వైశంపాయనుని స్కంధావారముతో రమ్మని తానుజ్జయినికిం బోయెను.

తరువాతఁ బత్రలేఖయుఁ గేయూరకుఁడునువచ్చి చంద్రాపీడునకు గాదంబరి విరహాతురత్వ మెఱింగించిరి. ఆమె తన్నుగుఱించి పరితపించు చున్నదని విని చంద్రాపీడుఁ డిల్లు కదలు నుపాయ మాలోచించుచు వైశంపాయనుఁడు సేనలతో రాక యచ్ఛోద సర'స్త్సీరమున విరక్తిఁ జెందియున్నాఁడను వార్తవిని ముందుగాఁ దనరాక కాదంబరికిఁ దెలియఁజేయుటకై పత్రలేఖను కేయూరకుని హేమకూటమున కనిపి తానుబోయి వైశంపాయనుని దీసికొని వత్తునని తండ్రి కెఱింగించి తదనుమతి బయలుదేరి తిన్నగా నచ్చోదసరస్సునకుఁబోయి యాప్రాంతముల నతని వెదకుచుఁ పిమ్మట మహాశ్వేతయొద్దకుఁ బోయెను.

మహాశ్వేత యతనిం జూచి దుఃఖించుచు వైశంపాయనుఁడు తన్నుఁ గామించి శప్తుండై మృతుం డయ్యెనని యాకథ యెఱింగించినది. ఆమాట వినినతోడనే చంద్రాపీడుఁడు ప్రాణములువిడిచి నేలంబడిపోయెను. అక్కడఁ గాదంబరియుఁ బత్రలేఖచేఁ దెలుపఁబడి చక్కగా నలంకరించుకొని మహాశ్వేతాశ్రమమునకు వచ్చి చచ్చియున్న చంద్రాపీడునింజూచి దుఃఖించుచు మహాశ్వేతవలెనే యశరీరవాణీచే నూరడింపఁబడి తద్దేహ మర్చించుచుఁ గొంతకాలము గడిపినది.