పుట:Kashi-Majili-Kathalu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

56

కాదంబరి

గనంబడకుండఁ బుష్పించిన లతావితానములమాటుగా నాయొద్దకు వచ్చి బాలికా! యిప్పు డిక్కడ స్నానముచేసిన కన్యక యెవ్వని కూఁతురు? పేరేమి? యెచ్చటికిఁ బోయినదని నన్నడిగెను.

అప్పుడు నేను వినయముతో ఆర్యా? యీచిన్నది హంసుఁ డను గంధర్వరాజు కూఁతురు. దీనిపేరు మహాశ్వేత. యిప్పుడాత్మీయ నివాసస్థానమైన హేమకూటమనుపర్వతమునకుఁ బోయినదని చెప్పితిని.

నామాటవిని యతండు ముహూర్తకాలమూరకొని యెద్దియో ధ్యానించుచు దేనినో యాచించువాఁడుంబలె రెప్ప వాల్పక నన్నుఁ జూచుచు సానునయముగా వెండియు నాకిట్లనియె.

కల్యాణీ! నీవు చిన్నదానవైనను నీరూపము నీ గౌరవమును, యోగ్యతను వెల్లడిచేయుచున్నది. నిన్నొండు యాచించుచున్నవాఁడ, కాదనక యాచరింతువే యనుటయు నేను వినయముతో నంజలి ఘటింపుచు మెల్లన నిట్లంటి.

మహాభాగ! మీరట్లు పలుకుటకు నే నెవ్వతెను. త్రిభువన పూజనీయు లగు మీవంటి మహాత్ములు పూర్వపుణ్యవశంబునం గాక యట్టి కృతులయందు దృష్టిప్రచారమైనఁ బరగింపరనుచో నాజ్ఞాపించుమాటఁజెప్పనేల? దాసురాలయెడఁగనికరముంచి చేయఁదగిన కార్య మెద్దియో చెప్పుడు. నమ్మకముగాఁ జేసి యనుగ్రహపాత్రురాల నగుదునని పలికితిని.

అప్పుడు నన్నతండు సఖురాలిగా మన్నించుచు సంతసముతో నాప్రాంతమందున్న తమాలతరుపల్లమును దెచ్చి తీరప్రస్తరముపై వైచి నలిపి రసముదీసి యారసమున వల్కలోత్తరీయమింతజించి దానియందు కనిష్టికానఖ శిఖరముతో నెద్దియో వ్రాసి, కనకగాత్రీ! నీవీ పత్రికం గొనిపోయి యారాజపుత్రి కేకాంతముగా నున్నప్పుడిమ్ము. పొమ్మని పలుకుచు నది నాకిచ్చెను. నేనును దానిం బదిలముగా