పుట:Kashi-Majili-Kathalu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పుండరీకుని కథ

53

వతంసముగాఁ దాల్పుము. పారిజాతము, జన్మము సాద్గుణ్యము నొందునని పలుకగా నితం డాత్మస్తుతివాదమునకు లజ్జించుచుఁ గన్నులు మూసికొని యామెమాటఁ బాటింపక నడువఁదొడంగెను.

అప్పుడాదేవియు నీపూవుందాల్చి విడువక వెంట వచ్చుచుండుటఁ జూచి, నేను మిత్రుఁడా? దీనదోషమేమి? యిది యద్దేవియనుగ్రహపరిగ్రహముకాదా! గైకొనుమని పలుకుచు నితం డిచ్చగింపకున్నను నేనుఁ బుచ్చుకొని బలాత్కారముగా దీని నతని శ్రవణాభరణముగా నిడితిని. ఇదియే దీని వృత్తాంతమని చెప్పి యతఁ డూరకుండెను.

పిమ్మట నప్పుండరీకుఁడు మందహాసోపశోభిత వదనారవిందుఁడై నన్నుఁజూచి కామినీమణీ! నీ కీ ప్రశ్నాయాసముతోఁ బనియేమి? కావలశినచో నీపుష్పగుచ్ఛమును బుచ్చుకొమ్మని పలుకుచుఁ దన చెవియందున్న లతాంతమును దీసి నాశ్రవణపుటంబున నుంచెను.

నాకప్పుడు తత్కరతల స్పర్శలోభంబునంజేసి యవతంసస్తానమున నాపూవు రెండవహృదయములాగున దోచినది. అతండును మత్కపోలతలస్పర్శసుఖంబున వడంకుచున్న కరతలంబునుండి జారిపడిన జపమాలికను సైతము సిగ్గుచేత గురు తెరుంగడు.

నేనప్పుడా జపమాలికను నేలంబడకుండ గ్రహించి విలాసముగాఁ దద్భుజపాశములచేఁ గూర్పఁబడిన కంఠగ్రహసుఖం బనుభవించు దానివలెఁ గంఠాభరణముగా మెడలో వైచుకొంటిని.

అట్టిసమయమున ఛత్రగ్రాహిణి నాయొద్దకు వచ్చి రాజపుత్రీ! మీతల్లి స్నానముజేసినది. ఇంటికిఁబోవు సమయమగుచున్నది. కావున వేగమ స్నానము చేయుమని పలికినది. ఆ మాట విని నేను గుండె దిగ్గుమన నిష్టములేకున్నను నతిప్రయత్నముతో నతనిమొగము నుండి దృష్టి మరలించుకొనుచు స్నానము చేయుటకుఁ బోయితిని.