పుట:Kashi-Majili-Kathalu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాశ్వేత కథ

51

దుర్లంఘ్యశాసనుం డగు మదనుం డప్పుడు మద్వికార దర్శనంబున నపహృతధైర్యుఁ డగు నతనిహృదయమును గూడ పవనుండు దీపమువలెనే చాంచల్య మందఁజేసెను.

యౌవనము అనినయబహుళమైనదికదా! అప్పు డతనికి గ్రొత్తగాఁ జిత్తమును జొచ్చుచున్న మదనుని నెదుర్కొనుచున్నట్లు రోమాంచము పొడమినది. నాయొద్దకు వచ్చుచున్న హృదయమునకు దారిజూపుచున్నట్లు నిట్టూర్పులు వెడలినవి. వ్రతభంగమున భయపడుచున్నదివోలె గరతలమందున్న జపమాలిక జారిపడినది.

అప్పుడు నేనతని వికారమును జూచి హృదయంబున మదనావేశము రెట్టింప నిట్టిదని చెప్పుటకు నలవికాని యవస్థం జెందుచు డెందమున నిట్లు తలంచితిని.

అనేక సురత లాస్య లీలావిశేషముల నుపదేశింప నుపాధ్యాయుండగు మన్మధుండే విలాసములను నేర్పునుగదా! లేనిచోశృంగార చేష్టలయందుఁ బ్రవేశింపని బుద్ధిగల యీమునికుమారుని దృష్టిప్రసారమింత మనోహరముగా నెట్లుండును?

ఈతని హృదయాభిలాషనంతయు నతని చూపులే చెప్పుచున్నవి. అని తలంచుచు దాపుగాఁబోయి యతని సహచరుండగు ఱెండవ మునికుమారునితోఁ బ్రణామపూర్వకముగా నిట్లంటిని.

ఆర్యా! యీమునికుమారుని పే రేమి? యెవ్వనికుమారుండు? ఈయన శ్రవణాభరణముగా ధరించిన పుష్పమంజరి యే కుంజమునఁ బుట్టినది? దీనిసౌరభమాఘ్రాణించినది మొదలు నాహృదయమెం తేని సంతసమందుచున్నది. ఇట్టి సుమమెన్నడును జూచి యుండలేదని పలుకుగా విని యమ్ముని కుమారుం డించుక నవ్వుచు నాకిట్లనియె.

బాలా! నీప్రశ్నముతోఁ బ్రయోజనమేల? కౌతుకమేని వక్కణించెద వినుము.