పుట:Kashi-Majili-Kathalu.pdf/58

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహాశ్వేత కథ

47

ఆ చిత్రరధుండు సమస్తగంధర్వులకు నధినాయకుండై యింద్రునితో మైత్రి సంపాదించి యీశ్వరప్రసాదంబున మనోహరముగా నిందు చైత్రరధమను పేర నీయుద్యానవనమును అచ్ఛోదమను నీసరస్సును నిర్మించెను.

అరిష్ట కొడుకు హంసుఁడనువాఁడును ద్వితీయ గంధర్వకులమునకుఁ బ్రభువగుచు గౌరి యను కన్యకను జంద్రకిరణములం బుట్టిన దానినిం బెండ్లియాడి యాకాంతామణితో సంసారసుఖము లనుభవింపుచుండెను.

ఆదంపతులకు సమస్తదుఃఖములకు భాజనమైన నే నొక్కరితన పుత్రికగా నుదయించితిని. నాతండ్రియు ననపత్యుఁడగుటచే నప్పుడు సుతజన్మాతిరిక్తమగు నుత్సవమును జేయుచు మిక్కిలి సంతోషించుచు జాతకర్మానంతరమునందు నాకు మహాశ్వేత యని పేరుబెట్టెను.

నేను బిత్రుగేహంబును మధురములగు మాటలచే బంధువులకు సంతోషము గలుగఁజేయుచు నవిదతశోకాయాస మనోహరమగు శైశవము సుఖముగా వెళ్ళించితిని.

అంతఁగాలక్రమంబున నామేన వసంతసమయంబునఁ బుష్పాంకురమువలె యౌవనము బొడసూపినది. సమారూఢ యౌవననైయున్న నేనొక్క వసంతకాలమునఁ దల్లితోఁగూడ స్నానార్ధమై యీసరోవరమునకుఁ జనుదెంచి యందందు శిలాతలముల వ్రాయఁబడిన శంభుమూర్తులకు నమస్కరించుచుచుఁ గుసుమోపహార రమ్యములగు లతా మంటపములను పుష్పించిన సహకారతరువులును వనదేవతాప్రేంఖలనశోభనములగు లతాడోలికలును కుసుమరజఃపటల మృగములగు కలహంస పదలేఖలచే మనోహరములగు తీరభూములునుం జూచినంత మనంబున నుత్సాహంబు దీపింప గొంపసేపు ప్రియవయస్యలతో నేనందు విహరింపుచుంటిని.