పుట:Kashi-Majili-Kathalu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిన్నెరమిథునముకథ

45

వినయముతో నిట్లనియె.

భగవతీ! భగవదనుగ్రహప్రాప్తిప్రేరకమైన సంతోషముచేతఁ దొట్రుపడుచు మానుషసులభమైన లాఘవము నన్ను నిచ్చలేకున్నను బ్రశ్నకర్మకుఁ బ్రోత్సాహపరచుచున్నది. ప్రభువుల యనుగ్రహ లేశము గూడ నధీరులకుఁ బ్రాగల్భ్యముగలుగఁజేయును. సహవాసము కొంచమైననుఁ బరిచయమును గలుగజేయకమానదు. ఉపచార పరిగ్రహ మల్పమైనను ప్రణయ మారోపించును. నీకు ఖేదకరము కాదేని నాయడుగు ప్రశ్నమున కుత్తరమియ్యవేడెదను. నిన్నుఁ జూచినదిమొదలు నాకీ విషయమై మిగుల కౌతుకము గలిగియున్నది. సురముని గంధర్వ గుహ్యకాదులలో నీజన్మముచేత నెవ్వారి కులము పావనమైనది? కుసుమకోమలమగు నీవయసున నిట్టి కఠిన వ్రత మేమిటికిఁ బూనితివి? అన్నన్నా! ఈప్రాయమేడ? యీయాకారమేడ? యీలావణ్య మేడ? యీతపమేడ? నాకుమిక్కిలి యక్కజముగా నున్నది?

సురలోక సౌఖ్యములు గల యాశ్రమములను విడిచి నిర్జనమగు నీ యడవిలో నొంటిగా నేమిటికి వసించితివి? యిట్టి చిత్రములు నే నెచ్చటను జూచి యుండలేదు. నీవృత్తాంతమంతయు నెఱింగించి నాసందియమును దీర్పుమని మిక్కిలి వినయముతోఁ బ్రార్థించెను.

అతనిమాటలు విని యవ్వనిత యెద్దియో హృదయంబున ధ్యానించి ముహూర్తకాల మూరకొని నిట్టూర్పులు నిగిడింపుచు ముక్తాఫలంబులఁబోలిన యశ్రుజలబిందువులు నేత్రకోణంబులనుండి వెల్వడి స్తనవల్కలమునుఁ దడియఁజేయఁ గన్నులు మూసికొని వెక్కి వెక్కి యేడువఁదొడంగినది.

అట్లకారణముగా విచారింపుచున్న యాయన్ను మిన్నంజూచి వెరగందుచు నతఁ డాత్మగతంబున నిట్లు తలంచెను. అన్నన్నా!