పుట:Kashi-Majili-Kathalu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

38

కాదంబరి

పర్యటనమువలన నలసిన తనబలమునకు విశ్రాంతి గలుగుటకై కొన్ని దినములు వసించెను.

కిన్నరమిధునము కథ

ఆరాజకుమారుం డొకనాఁడు ప్రాతఃకాలమున నింద్రాయుధ మెక్కి యొక్కరుఁడ విహారాధ౯మై యాప్రాంతారణ్యమునకుఁ బోయి యందందు సంచరించుచు దైవయోగంబున నొకచోఁబర్వత శిఖరమునుండి దిగుచున్న కిన్నరమిధునమునుఁ జూచెను.

అపూర్వవస్తు విశేషదశ౯నంబున మిగులసంతసించుచు నతం డమ్మిధునమునుఁ బట్టుకొనఁదలంచి తురగమును మెల్లగా దానిదాపునకుఁ బోనిచ్చెను.

అప్పు డెప్పుడును జూడని పురుషునింగనుటచే నమ్మిథునంబు వెరవుగదురఁ గాలికొలఁది పరువెట్టదొడంగెను.

చంద్రాపీడుండును మడమలచేఁగొట్టుచు నత్తత్తడి వడిగాఁ బరుగిడ సేనానివేశమునువిడచి యమ్మిధునమువెంట నొక్కరుండ మిక్కిలి దూరముగాఁ బోయెను.

అతనితురగ మతివేగముగాఁ బోవుచుండుటచే నమ్మిథునము దొరకునట్లే కనంబడుచు నెక్కడను జిక్కక యొక్క ముహూత౯ ఘాత్రములోఁ బదియేనామడ నడచి యతండు చూచుచుండగనే యందున్న పర్వతశిఖర మెక్కినది.

అంతవరకు నొక్కడుగులాగువచ్చి యచ్చటఁ బ్రస్తరశకలము లత్తురగ గమనమున కంతరాయము గలుగఁజేయ శ్రమజెంది మేనెల్లఁ జెమ్మటలుగ్రమ్మ నడుచుచున్న గుఱ్ఱమునునిలిపి తనకుఁదా నవ్వుకొనుచు నతం డాత్మగతంబున నిట్లు తలంచెను.