పుట:Kashi-Majili-Kathalu.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

కాదంబరి

యమ్మహాముని సమక్షమందు యధానిర్దిష్టముగాఁ గూర్చుండిరి. అర్ధయామావశిష్టమగు రాత్రియందు సుధాకర కిరణములచే జగంబంతయు వెండిపూసినట్లు ప్రకాశింపుచుండ మలయమారుతములు మేనులకు హాయిసేయ హరీతకుఁడు మధురఫలరసంబుల నన్నుఁ దృప్తుంజేసి మునులతోగూడ నతనియొద్దకుఁ దీసికొనిపోయి వేత్రాసనంబునం గూర్చుండి జాలపాదుఁడను శిష్యుండు పవిత్రపాణియై మెల్లగాఁ దాళ వృంతమున వీచుచుండ ఱెండవపరమేష్టివలె నొప్పుచున్న యా జాబాలికి నమస్కరించి నన్నెదుర నిలిపి వినయంబున నిట్లనియె.

తండ్రీ! యీ మునులందరు నీ చిలుక వృత్తాంతము వినుటకు మిక్కిలి వేడుక పడుచ్చున్నారు. ఇది తొలిజన్మమందెవ్వరు? ఎందుండునది? ఏమికారణమున నిట్టిజన్మమెత్తినది? సవిస్తరముగా నుడువుఁడని యడిగిన నజ్జడదారి సంతసించుచు వారినందరను గలయఁ గనుంగొని యిట్లని చెప్పదొడంగె.

తారాపీడుని కథ

క|| కలదుజ్జయినీ నగరం
     బిలను మహాకాళ నామకేశ్వరలింగా
     మలదీప్తి దీపితాలయ
     కలితంబై చారుసౌధ కమనీయంబై||

అవ్వీటి కధినాయకుండై తారాపీడుండను రాజు రాజ్యంబు సేయుచుండెను. అతండు నృగ, నల, నహుష, భరత, భగీరధ, ప్రభుతు లగు పూర్వనృపతుల నతిశయించిన కీర్తిగలవాఁడై నీతి శాస్త్రపారంగతుండును, ధర్మజ్ఞుండును, యజ్ఞపూత విగ్రహుండునునై