పుట:Kashi-Majili-Kathalu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3]

చిలుక కథ

17

నేను స్నానార్థమై పద్మసరస్సునకు బోవుచుండఁగా దారిలో నొక చెట్టుక్రిందఁ నెండతాపమున వాడి, దుమ్ములో నోరు దెఱచుకొని యొగర్చుచు నీ శుకపోతము నాకుఁ గనంబడినది.

అప్పుడు నాకు దయపుట్టి దీనిని సరస్సునకుఁ దీసికొనిపోయి తోయము ద్రాగించి సేదదీరినంత నిచ్చటికిఁ దీసికొనివచ్చితిని. ఱెక్కలు వచ్చువఱకు నిందొక తరుకోటరమున నిడి, నీవారకణ నికరముల చేతను వివిధఫలరసములచేతను నేనును నీ మునికుమారులును దీనిం బోషించువారము. ఱెక్కలువచ్చిన తక్షణము గగనతలమున కెగిరి యిష్టము వచ్చిన చోటికిఁ బోవునది. ఇదియే నా యభిప్రాయమని పలికిన విని జాబాలి యించుక వేడుకతోఁ దలయెత్తి పుణ్యజలముల చేతఁ బవిత్రముచేయువాడుంబలె నిర్మలమైన దృష్టులచే నన్నుపలక్షించుచు సారెసారెకు సాభిప్రాయముగా వితర్కించి నన్నుఁజూచి తలయూచి తానుఁ జేసికొన్న యవినయమునకు ఫలం బనుభవించు చున్నాఁడని పలికెను.

తపఃప్రభావసంపన్నంబగు దివ్యదృష్టిచేత సకల ప్రపంచమునంగల కాలత్రయ విశేషములు కరతలామలకముగాఁ జూడనోపిన యమ్మహానుభావుఁ డట్లుపలికినతోడనే యందున్న మునులందరు వెరగుపడి మహాత్మా? ఇది పూర్వజన్మమందెవ్వరు? ఎట్టియవినయ కృత్యము జేసి యిట్టిజన్మమెత్తినది? దీని పే రేమి? ఈ వృత్తాంతము వినుటకు మాకు మిగులఁ గుతూహలముగా నున్నది. వివరింపవే యని ప్రార్థించిన నతండు మునులారా! దీని చరిత్రము కడువింతయైనది. మనకు స్నానసమయమగుచున్నది. మీరును నిత్యానుష్టానములు దీర్చుకొని ఫలహారములఁ దృప్తులై రండు. రాత్రి సావకాశముగా నుడివెదనని పలుకగా వారందరు సంతసించి వడిగాఁబోయి కాల్యకరణీయములం దీర్చుకొని తత్కధాశ్రవణకౌతూహలముతోఁ గ్రమ్మరం జనుదెంచి