పుట:Kashi-Majili-Kathalu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిలుక కథ

9

మఱియు నత్తరువు విస్రబ్ధముగా జనులకారోహింపశక్యము కాని దగుట ఘాతుకులవలనఁ దమ కపాయము రాదని తలంచి శాఖాంతరములయందునుఁ గోటరోదరములయందునుఁ బల్లవాంతరముల యందును జీర్ణవల్కల వివరములయందును మిగుల నవకాశము గలిగి యుండుటచేత నానాదేశముల నుండి వచ్చి శుకసంతతులు గూడులు కట్టుకొని హాయిగా సుఖించుచున్నయవి.

అందొక జీర్ణకోటరమందు జాతిపులుగులతోపాటు కులాయము నిర్మించుకొని భార్యతోఁ గూడ మాతండ్రి చిరకాలము సుఖించెను. విధివశంబున నతనికి ముదిమియందు నేనొక్కరుండ పుత్రుండ నుద యించితిని. నేను బుట్టిన యాక్షణమునందే యతిప్రబలమగు ప్రసవ రోగంబున మా తల్లి పరలోకమున కతిథిగా నఱిగినది.

అభిమతజాయావినాశ శోకంబున స్రుక్కు చుండియు మా తండ్రి సుతస్నేహంబున నాశోక మడచికొని తానొక్కరుండ యే కొరంతయు రానీయకుండ నన్నుఁ బెనుచుచుండెను.

నాతండ్రి మిగుల వృద్ధుడగుట శిధిలములగు రెక్కలతో నెగర లేక వణకుచు స్రుక్కినముక్కు కొనచేత ఫలములజీర నశక్తుండై పర నీడములక్రింద నక్కడక్కడ జారిపడిన ఫలశకలంబులును తండుల కణంబులునుదెచ్చి నాకిచ్చుచు మద్భుక్తావశిష్టములచేఁ దాను సైత మాకలియడంచుకొనుచుఁ కొన్నిదినములు గడిపెను.

ఇట్లుండ నొకనాఁడు ప్రాఃతకాలమున లేతయెండచే వనతరు శిఖరపల్లవంబులు వింతకాంతిఁ బ్రకాశింపుచుండ గొన్నిచిలుకలు మేత కై దిక్కుల కరుగ మఱికొన్ని పిల్లలతోఁగూడ గూడులయం దణఁగి యుండ నిశ్చబ్దంబున నవ్వనస్పతి శూన్యమైనదివోలె నొప్పుచుండెను.

అప్పుడు నా తండ్రియు నన్ను రెక్కలలోఁ బెట్టుకొని ముద్దాడుచుండ నేనును బాల్యంబున నెగురుటకు రెక్కలురామిం జేసి యతని















`