పుట:Kashi-Majili-Kathalu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

8

కాదంబరి

నీ వెందుంటివి ?

నీకీ పంజరబంధము చండాలకన్యకాహస్తప్రాప్తియు నెట్లు కలిగినది. నీవృత్తాంతము విన మిక్కిలి కుతూహల మగుచున్నది. యెఱింగించెదవే యని యడిగిన నాపతంగప్రవరమాత్మగతంబున నించుక ధ్యానించి యిట్లనియె.

చిలుక కథ.

దేవా ! నాయుదంతము కడు పెద్దది. వినుటకు దేవర కిష్టమేని వక్కాణించెద నాకర్ణింపుఁడు. వింధ్యారణ్యాంతర్భాగం బగు దండకారణ్యమునఁ బ్రసిద్ధిజెందియున్న పంచవటీతీరమున కనతిదూరములో నున్న పంపాసరోవరము పశ్చిమభాగంబున శ్రీరామశరప్రభంజితములగు సప్తతాళముల ప్రక్క నొక్క వృద్ధశాల్మలీ వృక్షము గలదు.

అ త్తరువరంబు మూలంబు దిక్కరి కరంబులంబోని జరదజగరంబుచేఁ జుట్టుకొనఁబడి యాలవాలము గట్టఁబడినట్లొప్పుచు శాఖా సమూహములచేఁ దిగంతముల నావరించి విలయవేళాతాండవ ప్రసారిత భుజుండగు శంకరు ననుకరించుచు సాగరజలంబులం గ్రోలి యిటు నటు సంచరించుచుఁ బక్షులవలె శాఖాంతరములయం దణఁగియున్న మేఘంబులచేతఁ గూడ నావరింపబడని యగ్రభాగముగలదై రవితురంగముల కవరోధము గలుగఁజేయుటచే నలయిక జెందిన యవ్వారు నంబుల ముఖములనుండి వెల్వడు ఫేనపుంజమో యనఁబడు సితతూలికామాలికలచే నగ్రశాఖలు ప్రకాశింప నాకల్పస్థాయియగు నున్నత స్కంధముతో నొప్పుచు నబ్బూరుగు మేరువువలెఁ బ్రఖ్యాతిఁజెంది యున్నది.