పుట:Kashi-Majili-Kathalu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శూద్రకమహారాజు కథ

7

అందు స్నానసంధ్యావందన దేవపూజాది నిత్యక్రియాకలాపములు నిర్వర్తించుకొని రాజబంధువులతోఁగూడ నభిమతరసాస్వాదంబున బ్రీతుండగుచు భోజనముగావించి ప్రతీహారిమార్గ మెఱింగింప మనోహరాలంకారమండితంబైన విశ్రమమంటపమునకుఁ బోయి శయనతలంబునఁ గూర్చుండి తాంబూలము వైచికొనుచు నాప్తవర్గంబు చుట్టునుం బరివేష్టించి వినోదకథలచే చిత్తము రంజింపఁ జేయుచుండ నిండు వేడుకలతోనుండి యాభూమండలాఖండలుఁడు వైశంపాయనమును దీసికొనిరమ్మని ప్రతిహారి కాజ్ఞాపించుటయు నదివోయి యత్యంత శీఘ్రముగా నాజిలుక పంజరము దెచ్చి రాజుమ్రోలబెట్టెను. అప్పు డా భూపతి చిలుకంజూచి పతంగపుంగవా ! అభిమతభోజనంబున దృప్తుండవైతివే ? యని యడిగిన నదిదేవా ! సమదకోకిలలోచనరుచిం బురడించు జంబూఫలంబు లెన్నేని యాస్వాదించితిని. హరినఖరభిన్న మాతంగకుంభార్ద్రంబులగు ముక్తాఫలంబులం బోలిన దాడిమీబీజంబుల రుచి యేమనవచ్చును ? అన్నన్నా ! నళినీదళంబులు వోలె హరితములగు ద్రాక్షఫలముల మాధుర్య మెప్పటికైన మరువవచ్చునా ? అయ్యారే ! ప్రాచీనములగు నుసిరికకాయల పస యనుభవించి తీరవలయును. పెక్కేల భవదంతఃపురకాంతలు స్వయముగాఁ గరతలములచే నాకుఁ దినిపించినవన్నియు నమృతాయమానంబులై యున్న వని పెద్దగాఁ బొగడెను.

ఆమాట లాక్షేపించుచు నాక్షితిపతి పక్షీంద్రమా ! యది యట్లుండనిమ్ము. నీవేదేశమునం జనించితివి ? నీ తలిదండ్రు లెవ్వరు ? నీకు వేదశాస్త్రపరిచయ మెట్లుకలిగినది ? ఇతరవిద్యావిశేషము లెట్లు గ్రహించితివి ? జన్మాంతరానుస్మరణమా ! లేక వరప్రదానమా ? అదియునుంగాక శుకరూపము దాల్చి ప్రచ్ఛన్నముగాఁ దిరుగుచున్న యొకానొక దివ్యుఁడవా ? నీకెన్ని యేండ్లున్నవి ? యింతకు ముందు