పుట:Kashi-Majili-Kathalu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కపింజలునికథ

167


దినంబులు చంద్రలోకమునందును, గొన్నిదినంబులు లక్ష్మీసరస్సు నందు వసించి దివ్యభోగము లనుభవించుచుండెను.

అని యెఱింగించి మణిసిద్ధుండు గోపా! నీవుచూచిన చిత్ర ఫలకములోని యాకృతులు వీరివే. కాషాయవస్త్రము గట్టికొని గుహా ప్రాంతమున నిలువబడినది మహాశ్వేత. చంద్రాపీడుని విగ్రహము నర్చించుచున్నది కాదంబరి. అది మదలేఖ అది తరళిక అని యా వృత్తాంతమంతయు నెఱింగించుటయు నాలకించి యగ్గోపకుమారుండు సంతుష్టాంతరంగుఁడై యయ్యవారి ననేకప్రకారములఁ గైవారము సేయుచు నతనితోఁగూడఁ దదనంతరావసధంబుఁ జేరెను.

క. కాదంబరీ రసంబా
    స్వాదించిన నించుకంత పరవశులై సం
    మోదింతురు జనులనఁ ద
    న్మాధుర్యం బెఱుకపడదె మఱి విబుధులకున్.

గీ. బాణకవిచేత రచియింపఁబడియెఁ గొంత
    యతనిసుతుచేతఁ బూరితమయ్యెనంత
    మదియు నిదియుఁ గథాసంగ్రహంబు దప్ప
    కుండఁ దెనుగించినాడ గద్యోపసరణి.

క. నీకర్పించితి నీకృతి
    గైకొనుమా బాలచంద్ర కలిత లలిత ఫా
    లా! కాళీలోలా శై
    లాకర శెభకర మహేశ హరవిశ్వేశా!