పుట:Kashi-Majili-Kathalu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

కాదంబరి

సంతసముతోఁ జెంతనున్న కుమారపాలితుం డను వృద్ధమంత్రింజూచి ఆర్యా ! యాచిలుక పలుకులయందలి స్పష్టతయు మాథుర్యమును వింటివా ? ఇది వర్ణమాత్రానుస్వారస్వర సంకరము గాకుండ నభి వ్యక్తముగాఁ బలుకుటయే మొదటిఁ జిత్రము. మఱియు మనుజుండు వోలె బుద్ధిపూర్వకమగు ప్రవృత్తితో నభిమతవిషయమై కుడి చరణమెత్తి జయశబ్దపూర్వకముగా నతిపరిస్ఫూటాక్షరముగా పద్యము జదువుటఁ గడుంగడు నబ్బురము గలుగఁజేయుచున్నది. తరుచు పక్షులును, బశువులును నిద్రాహారమైధునభయసంజ్ఞామాత్రవేదులు గదా ?

అని పలుకుటయు గుమారపాలితుఁ డించుక నవ్వుచు దేవా ! ఇది యేమిచిత్రము. శుకశారికాప్రభృతి విహంగమ విశేషములు మనుష్యులచేఁ జెప్పబడిన మాటలం బల్కుచుండుట దేవర యెఱుంగనిదియా ? పూర్వము చిలుకులు మనుజులువలె బలుకుచుండునవి. అగ్ని శాపంబునం జేసి శుకవచనము లపరిస్ఫుటములైనవి.

అని యతండు సమాధానము జెప్పుచుండఁగనే ఛండకిరణుం డంబరతల మధ్యవర్తి యయ్యెనని తెలుపు భేరినినాదముతోఁ గూడ మాథ్యాహ్నిక శంఖధ్వని బయలు వెడలినది.

ఆధ్వని విని యమ్మహారాజు స్నానసమయమయ్యెనని తటాలున సింహాసనమునుండి లేచి రాజలోకమెల్ల సంభ్రమోత్సేకముతో గద్దియలు విడిచి వినయవినమితో త్తమాంగులై నిలువంబడిన శిరఃకంపమున వారికిఁ బోవుట కనుజ్ఞ నిచ్చుచు నచ్చండాల కన్యకతో మేము వచ్చినందాక నిందుండు మని నియమించి యచ్చిలుకను లోపలకుఁ దీసికొనిపోయి స్నానపానాశనాదివిధులం దీర్పుమని తాంబూలకరండ వాహినికిం జెప్పి సముచిత మిత్రలోకము సేవింప నభ్యంతరమందిరమున కరిగెను.