పుట:Kashi-Majili-Kathalu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

కాదంబరి

గంధర్వరాజ! ఎచ్చట నిరతిశయమగుసుఖముగలుగునో అదియే భవనము. ఇట్టిసుఖము నేనేభవనమునందును బొందియుండలేదు. అదియునుంగాక మదీయంబులగు భవనసుఖంబు లన్నియు నీయల్లునియందే సంక్రమించినవి. నాకిఁక యరణ్యమే శరణము. వధూయుతముగా నతనినే తీసికొని వెళ్ళుమని పలుకగావిని చిత్రరథుండు సమ్మతించి యప్పుడ తారాపీడుని యనుజ్ఞ వడసి చంద్రాపీడాదులతోగూడ హేమకూటమునకుం బోయెను.

అందు శుభముహూర్తమున సకలగంధర్వరాజ్యముతో జిత్రరధుండు కాదంబరిని జంద్రాపీడున కిచ్చి వివాహము చేసెను.

హంసుండు నట్లే మహాశ్వేతనుఁ బుండరీకునిఁ కిచ్చి పెండ్లి చేసెను. అట్లు చంద్రాపీడ పుండరీకులు గంధర్వరాజ్యములతోగూడ నచ్చేడియల స్వీకరించి యమ్మించుబోడులతోఁ గ్రీడించుచు దమ్మాశ్రయించుకొనియున్న యించువిల్కాని కాప్యాయనము గావించిరి. మఱియొకనాఁడు కాదంబరి చంద్రాపీడునితో ముచ్చటింపుచున్న సమయంబున నామె యతని కిట్లనియె.

ఆర్యపుత్రా! మనమందరము మృతిజెంది వెండియుం బ్రదికి యొండొరులము గలిసికొంటిమి. పత్రలేఖ సరస్సులోఁబడి తిరిగివచ్చినది కాదు. ఆమె వృత్త మెట్టిదని యడిగిన విని చంద్రాపీడుఁ డిట్లనియె. ప్రేయసీ! నాభార్యయగు రోహిణియే పత్రలేఖ. నేను బుండరీకునిచే శపింపఁబడి పుడమి జనించుచుండుటఁజూచి నన్ను విడువలేక నా శుశ్రూషకై నాకన్న ముందుగనే భూమియం దుదయించినది. అంతకుఁ బూర్వము నేనును నెఱుఁగను. శాపాంతమైనది కావున నిప్పు డంతయు స్ఫురించుచున్నదని యెఱింగించెను.

చంద్రాపీడుఁడు పుండరీకునితోఁ గూడికొని కొన్నిదినంబు లుజ్జయినియందును, కొన్నిదినంబులు హేమకూటమునందును, గొన్ని