పుట:Kashi-Majili-Kathalu.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

162

కాదంబరి

నేనీ దురాత్ముని గన్నతల్లిని. మహాలక్ష్మిని. వధూదర్శనోత్సుకుండై యరుగుచున్న కుమారుని దుర్వృత్తి దివ్యదృష్టింజూచి శ్వేతకేతుఁడు నన్నుంజీరి నీపుత్రుం డింకను నధోగతిం బొందునట్లు తోచుచున్నది. పశ్చాత్తాపంబునంగాని వానిచిత్తవృత్తి యుపశాంతి వహింపదు. నీవువోయి వానికిఁ గర్మపరిపక్వమగుదనుక నొకచోటఁ గట్టిపెట్టి యనుతాపము గలుగునట్లు చేయుము వేగమ బొమ్మని యాజ్ఞాపించుటయు నేనీకల్పన యంతయుం గావించితిని.

క. నీవా చంద్రాపీడుఁడ
    వావైశంపాయనుండె యౌ నీశుకమో
    భూవర! మీకిత్తఱిశా
    పావిలదోషావసానమై యొప్పుటచే.

మీ యిరువురును శాపావసానంబున సమముగా సుఖియింపఁ గలరని వీని నీచెంతకుఁ దీసికొనివచ్చితిని. లోకసంపర్క పరిహారమునకై చండాలజాతిం బ్రకటించితిని.

ఇప్పుడు మీ యిరువురు జన్మజరామరణాది దుఃఖబహులములగు శరీరములవిడిచి యదేష్టజనసమాగము సుఖంబుల ననుభవింపఁ గలరని పలుకుచు నమ్మాతంగకన్యక మంజీరరవంబు ఘల్లురని మ్రోయఁ బాదంబులం నేలందట్టి యంతరిక్షమున కెగిరి యదృశ్యయై దివమునకుం బోయెను.

పిమ్మట నమ్మనుజపతి యయ్యువతి వచనములు వినినంత జాతి స్మరణ గలుగుటయుఁ గాదంబరిం దలంచుకొనుచుఁ గ్రమంబునఁ గాదంబరీ వియోగసంతాపంబునం గృశించి కందర్పశరాసారఘాతంబునం దుదకుఁ గాలధర్మము నొందెను. ఆచిలుకయు శాపావసానమైనది కావున నయ్యొడయనితోగూడ నయ్యొడలు విడిచినది.