పుట:Kashi-Majili-Kathalu.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19]

కపింజలునికథ

145

ధాత్రి నుజ్జయినీపురంబున నపత్యమునకై తపంబుజేయుచున్న తారాపీడునకుఁ బుత్రుండై చంద్రుం డుదయించును. నీమిత్రుండు పుండరీకుండును దదమాత్యుండైన శుకనాసునికి జనియించుం గావున నీవా రాజపుత్రుని యశ్వరత్నమై యుదయింపుము. నీయందుఁగల ప్రేమచే నింత దలంచితి పొమ్మని పలికినతోడనే నేనధోభాగముజూచి సముద్రములోఁబడి యశ్వమై పుట్టితిని. అట్టిజన్మమునందుగూడ నాకు జాతిజ్ఞానముకలదు. కావున నశ్వముఖమిధునము గనంబడినతోడనే వెంటంబడి యీభూమికిఁ దీసికొనివచ్చితిని. ఈచంద్రాపీడుఁడు చంద్రుని యవతారము. పూర్వజన్మానురాగంబున నిన్నభిలషించి నీశాపాగ్నిచే దగ్ధుండైన వైశంపాయనుఁడే పుండరీకుఁడని పలికి యూరకుండెను.

ఆమాటవిని మహాశ్వేత, హా! దేవ! హా! పుండరీక! నీవు లోకాంతరగతుండవైనను నన్నే స్మరించుచుంటివి? ఈరక్కసితో నీ కేమిప్రయోజనమున్నది. నేను వినాశముకొరకే జనించితిని కాబోలు. నన్ను సృష్టించి దీర్ఘాయు వొసంగుట పరమేష్టి కేమిప్రయోజనమో తెలియకున్నది. నే సమసితినేని నీకీయాపద రాకుండునుకదా! ఇప్పుడు నేనేమిచేయుదును? ఎవ్వరితోఁ జెప్పుకొందును? రక్షించువారెవ్వరు? అయ్యో! అయ్యో! ఇంచుకంతయుఁ దెలిసికొనలేకపోయితినే యని యనేకప్రకారముల విలవించుచు నురము బాదుకొనుచు నేలం బడుటయుంజూచి కపింజలుఁ డిట్లనియె.

గంధర్వరాజపుత్రీ! నీవిట్లు నిందించుకొనియెదవేమిటికి? నీయందేమిదోషమున్నది. వెండియు నిప్పుడు దుఃఖించుట కవసరమేమివచ్చినది. యలఁతితరిలో సుఖమే యనుభవింపఁగలవు. మీయిరువురు తచ్ఛాపాంతమునఁ బతులతో గలసికొందురు. అశరీరవాణిని మీరు వినియుంటిరికదా! అంతదనుక తపంబే చేయుచుండుఁడు. తపంబున