పుట:Kashi-Majili-Kathalu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

144

కాదంబరి

పూర్వ మతని శరీరము గ్రహించి యశరీరవాణిచే మహాశ్వేత నూరడించుచు నిచ్చటికివచ్చితిని. ఇది బుండరీకునిశరీరము శాపాంతము వరకు నిచ్చటనే యుండును. నీవుబోయి యీవృత్తాంతము శ్వేతకేతున కెఱింగింపుము. అమ్మనుభావుఁ డెద్దియేని ప్రతిక్రియఁ చేయనోపునని పలికి నన్ను విడిచెను.

అప్పుడు నేను మిత్రశోకంబున నంధుండుబోలె గీర్వాణమార్గంబునఁ బరుగిడుచుఁ జూడక యొకవైమానికునిం దాటితిని.

దాన నతండు కోపించి ననుఁ జురచురం జూచుచు దురాత్మా! మిధ్యాతపోబలగర్విత! మిక్కిలి విస్తీర్ణమగు గగనమార్గంబున గుఱ్ఱము వలె నన్ను దాటితివి. నీకెందును జోటు దొరికినదికాదు కాబోలు కానిమ్ము నీకట్లు దాటుట యుత్సాహమని తోచుచున్నది. నీవు తురంగమై భూమియందు జనింపుమని శపించెను.

అప్పుడు నేను గన్నుల నీరుగార్చుచు నంజలిఘటించి దేవా! నేను మిత్రశోకాంధత్వంబున నిన్ను దాటితిని కాని తిరస్కారభావంబునంగాదు అనుగ్రహించి యాశాప ముపసంహరింపుమని వేడుకొనుటయు నతండు వెండియు నిట్లనియె.

ఆర్యా! నాశాపము త్రిప్పనలవికాదు. నీవు గుఱ్ఱమవై యెవ్వని వహింతువో వాని యవసానమున స్నానముచేసినంత ముక్తుండవయ్యెద నిదియే నాచేయు నుపకారమని పలికిన నే నిట్లంటి.

దేవా! అట్లయిన నేనొండు విజ్ఞాపనజేయుచున్నవాఁడ శాపదోషంబున నామిత్రున కిప్పుడు చంద్రునితోఁగూడఁ బుడమియందుఁ బుట్టవలసియున్నది. కావున దేవర దివ్యదృష్టిచేజూచి యశ్వజన్మమందు సైత మతనితోఁగలసి కాలముగడుపు నట్లనుగ్రహింపుము. ఇదియే నా కోరికయని పలికినవిని యతం డొక్కింత విచారించి యిట్లనియె.