పుట:Kashi-Majili-Kathalu.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18]

వైశంపాయనుని కథ

137


టయుఁ దత్పరిజనము పెద్దయెలుంగున రోదనముజేసెను. అయ్యాక్రందము వలననే యతండు దేవర మిత్రుఁడని తెలియవచ్చినదని పలికి తలవంచుకొని మిక్కుటమగు నశ్రుధారచే భూమినిఁ దడిపినది.

అట్టి మాటలువిని చంద్రాపీడుఁడా కారణాంత విశాలమగు నేత్రములు మూయుచు భగవతీ! కాదంబరితో నన్ను గూర్చుటకు నీవు తగిన ప్రయత్నముచేసితివి. మందభాగ్యుండనగు నా కట్టియోగ్యత లేనప్పుడు నీవేమిచేయగలవు. ముందుజన్మమునకైనఁ గాదంబరీ చరణ పరిచర్యాసుఖము గలుగు నట్లనుగ్రహింపుమని పలుకుచునే హృదయము భేదిల్ల నట్టె నిలువంబడి ప్రాణముల విడిచెను.

చంద్రాపీడుఁడు వయస్యుని మరణవార్తను వినినతోడనే డెందము పగిలి జీవితము వాయుటఁజూచి తరళిక మహాశ్వేతను విడిచి యతనిం బట్టుకొని అయ్యో! చేడియా! యింకను సిగ్గేమిటికే యీతఁడు ప్రాణములను విడిచినట్లు తోచుచున్నది. మెడనిలుపక వాల వైచెను. చూడుము శ్వాసమారుతలేమియు వెడలుట గనంబడదు. కన్నులు మూయఁబడియున్నవి. హా! చంద్రాపీడ! కాదంబరీప్రియ యిప్పు డప్పడతిని విడిచి యేడకుఁబోయితివి. యా ప్రేముడియంతయు నెందుఁ బోయెనని పెద్దయెలుంగున నేడ్చుచుండజూచి మహాశ్వేతయు నతని మొగమునఁ జూట్కినిలిపి వైవరణ్యమును గనిపెట్టి గాఢశోకంబున జేష్టతక్కి పడియుండెను.

అప్పు డతని పరిజన మా వృత్తాంత మెఱింగి హాహాకారములతోఁ బెక్కు తెరంగుల నమ్మహాశ్వేతను దూరుచు నుచ్ఛస్వరంబున హా! రాజకుమార! హా వైశంపాయన! హా! తారాపీడ ! హా! శుకనాస! హా! విలాసవతి! హా! మనోరమ! మీకెట్టి యాపద సంప్రాప్తించినది. కటకటా! ప్రజలెంత భాగ్యహీను లయ్యెయో!