పుట:Kashi-Majili-Kathalu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైశంపాయనుని కథ

135

పుండరీకునికథ జరిగినది మొనలు నేనుత్సాహముడిగి యుంటిని కావున వానిమాటలువిని నీవెవ్వఁడవు? నీపేరేమి? నీవృత్తాంతమెట్టిది? నన్నిట్లు పలికెదవేలయని యడుగకయే యచ్చటినుండి మఱియొక చోటికి బోయి దేవతార్చన పుష్పములంగోయుచున్న తరళికంజీరి యిట్లంటిని.

తరుణీ! యీతరుణండెవ్వఁడే వీని యాకారముజూడ బ్రాహ్మణకుమారుఁ డట్లతోచుచున్నయది. నన్నుజూచినంత వీనిస్వాంతమున వెఱ్ఱిచేష్ట లంకురించుచున్నయవి. కావున వాని నిచ్చటికి వెండియు రాకుండునట్లు చేయుము. కూడఁగూడ తిరుగుచున్నవాఁడు. నివారించి నను వచ్చెనేని తప్పక యమంగళమును జెందగలఁ డని పలికితిని.

అదియు నతనితోఁ దగినట్లు చెప్పినది కాని మదనహతకునివృత్తి దుర్నివారమైనదగుటచే వానిచిత్తము మరలినదికాదు.

మఱికొన్నిదినములు గడచినంత నొకనాఁడురాత్రి జ్యోచ్స్నాపూరముచే జగంబంతయు నిండియుండ సంతాపంబువాయనే నీశిలా తలంబున శయనించి మందమందముగా నచ్చోదానిల పోతములు వీచుచుండఁ బుండరీకుని వృత్తాంతమే స్మరించుకొనుచు నిద్రపట్టమింజేసి యిందుబింబవిలాస మరయుచుఁ గన్నులుమూయక యట్టెచూచుచుంటిని.

అట్టిసమయమున నాబ్రాహ్మణకుమారుఁడు మదనావేశితహృదయుండై మెల్లగా నడుగులిడుచు నాయొద్దకువచ్చెను. నిస్పృహురాలనైనను వానిఁజూచినంతనే స్వాంతమున భయము జనింప నిట్లు తలంచితిని. అయ్యో! మంచియాపద తటస్థించినదే వీఁడు నన్నుముట్టినంత మాత్రమునఁ బ్రాణములు విడువవలసినదేకదా. పుండరీకునిరాక నిరీక్షించి యిన్నిదినములు ప్రాణములు దాల్చినది వ్యర్థమైపోవునే యని యాలోచించుచున్న సమయమున నతండునాదాపునకువచ్చి యిట్లనియె.