పుట:Kashi-Majili-Kathalu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

134

కాదంబరి


దీర్పలేక పోయితిని. కాదంబరికోరికయు సఫలము చేయలేకపోయితిని. యారాజకుమారుని యబీష్టము తీరినదికాదు. నేనువచ్చి యేమిచేసితినని సిగ్గుపడుచుఁ గాదంబరీ స్నేహపాశములంగోసి వెండియు దపంబు జేయుటకై యీ యాశ్రమమునకువచ్చి యిచ్చట దేవరఁబోలియున్న యొక్కబ్రాహ్మణకుమారుం డెద్దియో వెదకుచున్నట్లు శూన్యహృదయుఁడై నలుమూలలు జూచుచుండ గంటిని.

అప్పు డతండు నాయొద్దకు మెల్లగావచ్చి యదృష్టపూర్వుండై నన్ను నెన్నఁడో యెఱిఁగిన వాడుంబోలె నాముఖము రెప్పవాల్పక చూచుచు నాకిట్లనియె.

శోభనాంగీ! లోకంబున నెవ్వరును జన్మకును వయసునకును రూపమునకునుం దగినట్లు మెలంగిరేని నిందాపాద్రులుకారు. నీవట్లుగాక తగనివ్రయము చేయుచుంటివేమి? కుసుమసుకుమారమగు నీమైదీగె నుత్కృష్టతపఃకరణక్లేశంబున నిట్లు వాడఁజేయనేమిటికి? సుమనోమనోహరంబగు లతయుంబోలె నీయాకృతి ప్రాయములకుఁ దగినయట్లుగా రసాశ్రయమగు ఫలముతోఁ గూడుకొనకుండుట లెస్సయే. తపంబు పరలోకసుఖప్రదంబు. రూపగుణహీనులు సైత మైహికసుఖంబు లనుభవించుచుందురు. ఆకృతిమంతులమాటఁ జెప్పనేల? తుషారబిందుపాతంబునఁ పద్మినీలతయుంబోలె స్వభావసుందరమగు నీశరీరమిట్లు తపఃక్లేశంబునం గృసియించుట జూచిన నాకు మిక్కిలి విచారమగుచున్నయది. మఱియొక నీవంటివాల్గంటియే యింద్రియసుఖంబుల నిరసించి వైరాగ్యమును బూనియుండ నిఁక దర్పకుని పుష్పసాయక ధారణము వ్యర్థము సుమీ, చంద్రోదయముతోఁ బనియేమి? వసంతమలయా నిలముల రాక నిరర్ధకమే! కువలయకల్హార కమలాకర విలసనములు నిష్ప్రయోజనములు మనోహరోధ్యాన భూము లెవ్వరికిఁ గావలయునని పెక్కు తెరంగుల వక్కాణించెను.