పుట:Kashi-Majili-Kathalu.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

132

కాదంబరి

మేఘనాధ! అచ్ఛోదస్సరస్త్సీరంబున నీకు వైశంపాయనుఁడు కనంబడియెనా? చూచి మాట్లాడితివా? ఏమనియెను? ఇప్పటికైనం పశ్చాత్తాపముజెంది యింటికి రావలయునని తలంచుచున్నవాఁడా! నా మాటయేమైనం దెచ్చెనా, యని తల్లిదండ్రులు జ్ఞాపకముండిరా యని యడిగిన నతం డిట్లనియె.

దేవా! దేవర ఇదిగో నేను వైశంపాయునితో మాట్లాడి నీ వెనుకనే వత్తునని చెప్పితిరికదా. మేమట్లుపోయి మీ రాక వేచియుండ నెప్పటికి వచ్చితిరికారు. అప్పుడు పత్రలేఖయుఁ గేయూరకుఁడు నన్నుఁ జూచి మన చంద్రాపీడుని వర్షాకాలమగుటచేఁ దల్లితండ్రులు రానిచ్చిరి కారు. నీవిచ్చోట నొక్కరుఁడ వుండనేల ఇంటికిఁ బొమ్మని పలికి వారిరువురు హేమకూటమునకుఁ బోయిరి.

నేను మఱికొన్ని దినములందుండి తిరుగానింటికి వచ్చుచున్నవాఁడ. నింతియకాని వైశంపాయనుని వార్త నా కేమియుం దెలియదు. అతం డచ్ఛోదసరస్సునకుఁ బోవుటయే నేనెఱుఁగనని చెప్పినవిని యా రాజకుమారుఁడు వెండియు వానితో నోరీ! అట్లైన సరియేకాని పత్రలేఖ యిప్పటికి హేమకూటముజేరునో లేదో చెప్పఁగలవా యని యడిగిన వాఁడిట్లనియె.

దేవా! దైవికమైన యంతరాయమేదియు రాకుండిన నది యాలస్యము చేయునదికాదు. కావున నేఁటి కబ్బోఁటి హేమకూటము జేరుననియె. నా యభిప్రాయము అనిచెప్పిన సంతసించుచుఁ జంద్రాపీఁడుడు వానితోఁగూడఁ గ్రమంబున వైశంపాయనింజూచు వేడుకతో నచ్ఛోదసరస్సునకుఁ బోయి యందు గుఱ్ఱపురౌతుల కిట్లనియె.

వైశంపాయనుఁడు వైరాగ్య వృత్తిబూని యీ వనములో నెచ్చటనో యణఁగియున్న వాఁడు. మనలనుజూచి పారిపోవును. కావున