పుట:Kashi-Majili-Kathalu.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైశంపాయనుని కథ

131

పిమ్మట నా కొమ్మను శుభముహూర్తమునం బెండ్లియాడి బహుళకుసుమదామ భూషానులేపనాది వస్తుమండితమగు భవనంబునఁ బుష్పశయ్యపై మత్సమీపమున గూర్చుండి వయస్య లరిగిన వెనుక తానును మొగమువంచి యరుగఁబోవు నయంబున బలత్కారముగా సందిటిలో నిమిడ్చికొని తల్పంబునఁజేర్చి పిమ్మటఁ దొడయం దిడుకొని యెడమచేతితోఁ గేశపాశముగైకొని కుడిచేతిలో నధరము పుడుకుచుఁ గపోలములఁ జుంబించుచు సురలకు సైతము దుర్లభమయిన యధరామృతము తనివితీరఁ గ్రోలెదను.

అంత నింతింతనరాని సంతసముతోఁ గంతుసంతాపమునఁ గృశించియున్న యవయవములకు గాఢాలింగన సుఖరస భరంబున నుబ్బుగలుగఁ జేయుచుం దరువాత నా నాతితోఁగూడ మదనాగ్ని నార్పునదియు నింద్రియములకు సుఖమిచ్చునదియుఁ బెక్కుసారు లనుభవించుచున్నదైనను గ్రొత్తదానివలె దోచునదియు నిట్టిదని చెప్పుటకు నలవికాని సంతోషము గలుగజేయునదియు నిర్వాణ సుఖసాదృశ్యము గలదియు సచింత్యమయినదియు నగు సుఖ మనుభవించుచు నిమిషమైనను విడువక రమ్యప్రదేశములఁ గ్రీడింపుచు యౌవనమునకుఁ దృప్తి గలుగఁ జేసెదను.

ఆ రీతిఁ గాదంబరికి సంతోషము గలుగఁజేసి మదనలేఖను వైశంపాయనునకుఁ బెండ్లిచేసెదను. అని యిట్లు పెక్కు తెరంగుల నంతరంగమ్మునఁ దలపోయుచు మేను గరువుజెంద ననుభూతుఁడైన వాఁడుంబోలె నారాత్రి నిద్దురంజెందక తృటిలాగునగడిపి యుదయంబునలేచి సముచిత పరివారంబు సేవింప నింద్రాయుధమెక్కి యక్కుమారుం డప్పురము వెడలి కతిపయప్రయాణంబుల నచ్ఛోదసరస్త్సీరమునకుఁ బోవుచు నించుకదూరములో నెదురుపడిన మేఘనాధునింజూచి యత్యాతురముగా నిట్లనియె.