పుట:Kashi-Majili-Kathalu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

128

కాదంబరి


మనకు శోకమునకే కారణమైనది అని పలికి కన్నీరు నించుచు నిట్టూర్పులు నిగుడించెను.

అప్పుడు తారాపీడుఁ డతనిం జూచి యార్యా! యూరడిల్లుము. వ్యజనానిలముచేత వాయువును వృద్ధిజేసినట్లుకదా! మీకు మేము బోధించుట! బహుశ్రుతుండైనను బ్రాజ్ఞుండైనను వివేకియైనను ధీరుండయినను దుఃఖాతిపాతంబునఁ జిత్తచాంచల్యమందకమానఁడు. మనస్సు చెడినవానికేమియుం దెలియదుకదా! వైశంపాయను గురించి కోపావేశముతోఁ బలుకుచున్న నీమాటలు వినుటచే నాకు మిక్కిలి వ్యసముగానున్నది. యతనియెడఁ గోపమును విడువుము. వాఁడు మిక్కిలి గుణవంతుఁడు కారణ మరయక వానినిందింపరాదు. చంద్రాపీడునంపి వానిశీఘ్రముగా నిచ్చటికి రప్పించి యట్టి విరక్తి నేమిటికిఁ బూనెనో యరయుదముగాక యరసినపిదప యధాన్యాయముగా నాచరింతమని పలికిన విని వెండియు శుకనాసుం డిట్లనియె.

దేవ! నీకు వైశంపాయనుని యందు గల మక్కువచే నిట్లనుఁ చున్నావు. నీయౌదార్యమట్టిదయే కాని యువరాజును విడిచి యాత్మేచ్ఛచేనుండుట గష్టమని పలికిన విని చంద్రాపీడుఁడు తండ్రియన్న మాట హృదయంబున ములికిపోలికనాఁటియుండ గన్నీరునించుచు గూర్చుండియే మెల్లగా దాపునకుఁ బోయి శుకనాసునకిట్లనియె.

ఆర్య! వైశంపాయనునివిషయమైన నావలన నేమియు దోసము లేదని చెప్పకపోయినను నేనెఱుంగుదు, అయినను మాతండ్రిగారి కనుమానము దోచుచున్నదని పలికిరికదా! లోకులు సైతమట్లే భావింతురు. అసత్యమయినను లోకాపవాదము భరించుట గష్టము. అయశఃప్రసిద్ధి లోకంబున వ్యాపించెనేని పరలోకహాని కాగఁలదు. కావున దీనికిఁ బ్రాయశ్చిత్తముగా వైశంపాయనుని దీసికొని వచ్చుటకు నన్ను నియమింపుము. మఱియొకరీతి నాకు నిష్కృ