పుట:Kashi-Majili-Kathalu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వైశంపాయనుని కథ

127


లేము. ఇంత నిష్ఠురత్వము నీవేటికి బూనితివి? చంద్రాపీఁడునిఁవిడిచి క్షణమైనఁనుండువాడవు కావే తద్వియోగమిప్పు డెట్లు సైచితివి? ఆస్నేహమంతయు నేమయిపోయినది? నీవట్టివైరాగ్యము బూనుటకుఁ గారణమేమి? అయ్యయ్యో! ఎంతవచ్చినది? ఏమిచేతును? పుత్రా! యని యీరీతి పెక్కు తెరంగులఁ బుత్రశోకంబున విలపించుచున్న మనోరమగంఠధ్వనివిని యతండు విహ్వలుఁడై మూర్ఛవోయియంతలో దెప్పిరిల్లి క్రమంబునఁ దండ్రియొద్దకుఁ బోయి యతనిం జూచుటకు సిగ్గుపడుచుఁ దల వంచుకొని నమస్కరింపుచు దూరముగాఁ గూర్చుండెను.

ఆరాజు పుత్రుం జూచి బాష్పగద్గదస్వరుండయి వత్సా! చంద్రాపీడ! నీకు వైశంపాయనునియందు జీవితముకన్న నెక్కుడు ప్రీతియని యెఱుంగుదును కాని యతనివృత్తాంతము వినినది మొదలు నాహృదయము నీయెడ ననుమానము జెందుచున్న దేమని; పలికిన విని యతనిమాట లాక్షేపించుచు శుకనాసుం డిట్లనియె.

దేవ! అగ్నిచల్లబడినదనినను సూర్యుని నంధకారము గ్రమ్మినదనినను సముద్రమింకినదనినను నమ్మవచ్చును కాని చంద్రాపీడుఁ డట్టిదోషమును జేయునని తలంపరాదు. కృతయుగావతారమని చెప్ప నోపిన చంద్రాపీడుని సుగుణముల విమశి౯ంపక మిత్రఘాతకునిగా సూచించితిరేల? విచారింపవైశంపాయనుఁడే దుజ౯నుఁడని తలంచెదను. లోకంబునఁ బుత్రులంగనుట వంశవృద్ధికొరకుఁగదా! తండ్రి యానతిఁబూనక నేనెట్లు వైరాగ్యమును బూనుదునని యించుకంతయు వానిస్వాంతమునఁ బుట్టినదికాదే? అట్టిదుర్మాగు౯ని విషయమై దయదలపఁనేటికి? వాఁడు పెంచినచిలుకవలె దేవరచేఁ బోషింపఁబడి యంతయు మరచి యిప్పుడు కృతజ్ఞత దలంప విడిచి వెళ్ళెనే. ఆత్మద్రోహము చేసినవానితో మనకేమి? అప్పాపాత్ముని జననము