పుట:Kashi-Majili-Kathalu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

కాదంబరి

మఱియు, దృఢముష్టినిష్పీడనంబునంబయలు వెడలిన జలధారయుంబోలె నాభూపాలు కేలంగ్రాలు కరవాలంబు కరికటతటగళిత మదజలాసారదుర్దినములగు సంగరసమయములయందు వీరభటకవచ సహస్రాంధకార మధ్యవర్తినియైయున్న జయలక్ష్మి నభిసారికవోలెఁ బెక్కుసారులతనిచెంతకుఁ దీసికొనివచ్చినది.

అయ్యవనీపతి కువలయభరంబు వలయంబువోలె నవలీలనిజ భుజాగ్రంబున భరించుచుఁ బలుమారు నీతిశాస్త్రములెల్ల నవలోకించి బుద్ధిబలముచే బృహస్పతి నై నంబరిహసించుచుఁ బ్రబుద్ధులనివాడుక జెందిన కులక్రమాగతులగు మంత్రులు సేవింప సమానవయోవిద్యా విభూషితులు ప్రేమానురక్తహృదయులు నసమసమరక్రీడాభిరతులు నగు రాజసుతులతోఁ గూడికొని క్రీడించుచుఁ బ్రధమవయస్సు సుఖముగా వెళ్ళించెను.

సీ. అతులస్వరంబు లుప్పతిలంగ వీణగై
                 కొనిపాడు హాయిగాఁ గొంతసేపు
    మహితప్రబంధనిర్మాణ క్రియారత
                 స్వాంతుఁడై యలరారుఁ గొంతసేపు
     దర్శనాగతతసోధనజనారాధనా
                 కుతుకాత్ముఁడై యుండుఁ గొంతసేపు
     చర్చించు సకలశాస్త్రప్రసంగంబులఁ
                 గోవిదావళిఁగూడి కొంతసేపు

గీ. కోర్కెచిత్తరువులు వ్రాయుఁ గొంతసేపు
    గురుపురాణము లాలించుఁ గొంతసేపు
    జంతుసంతతినాడించుఁ గొంతసేపు
    అంగనాభోగవిముఖుఁడై యనుదినంబు.