పుట:Kashi-Majili-Kathalu.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

కాదంబరి


బరిగ్రహింపఁదగినది. ఇప్పుడేమి చేయుదును? అని యాలోచించుచుఁ బత్రలేఖ చేయిపట్టుకొని తల్లియొద్దకుఁ బోయెను.

విలాసవతియు వారిం గారవించి మీరు నిత్యమొక్కసారి యెప్పుడో వచ్చి నాకన్నులం బడుచుండవలయు లేనిచో నేనోపఁజాలనని పలుకుచు నాదివసమెల్లఁ దనయొద్ద నుంచుకొని యంపినది. చంద్రాపీడుఁడది మొదలు కాదంబరీ విరహవేదనాకులుండై మదనాగ్నిచే బాధింపఁబడును శుష్కించిపోవు గడియయొక్క యేఁడుగా గొన్నిదివసములు గడిపెను.

మఱియొకనాఁ డతండు పత్రలేఖవెంట రాఁ బాదచారియై బాహ్యోద్యానవనంబున కరిగి యందు విహరింపుచుండఁ గొండొక దూరములో విచిత్రగమనంబుల వారువములు నడిపించుచు వచ్చు చున్న యొకరౌతు నేత్రపర్వము గావించుటయు నతం డెవ్వఁడో చూచి రమ్మని యొకపరిచారకు నంపి తద్వాత౯ నరయుటకై యెదురు చూచుచుఁ బత్రలేఖా! అతఁడు గేయూరకుఁడువలెఁ గనంబడుచున్నాడు. చూడుమని పలుకుచుండఁగనే యతం డచ్చట కరుదెంచి గుఱ్ఱమును డిగ్గనురికి రాజపుత్రునికి నమస్కరించెను.

చంద్రాపీడుఁడు ప్రీతిచేఁ జేతులు సాచి రమ్ము రమ్ము. అని పలుకుచు నతని గాఢాలింగనము జేసికొని కేయూరకా! నీదశ౯నముచేతనే కాదంబరి సేమముగా నున్నదని తెలియఁబడుచున్నది. నీయాగమనకారణము విశ్రాంతి వహించి యెఱింగింతువు గాక అని పలుకుచుఁ బత్రలేఖా కేయూరకులతోఁ గూడ నొక యేనుఁగనెక్కి నిజభవనంబునకుం బోయెను.

లోపలి కెవ్వరిని రానీయవలదని ద్వారాపాలురకు నియమించి పత్రలేఖా కేయూరకులతోఁగూడ గృహారామము లోనికిం బోయి యందున్న పరిజనులఁ దూరముగా బొమ్మని రాజపుత్రుండు కేయూ