పుట:Kashi-Majili-Kathalu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

112

కాదంబరి


దుఃఖింపకుము. నేను వేగమపోయి యారాజకుమారునిఁ దీసికొని వచ్చెదనని పలికినంత భవదీయ నామసంకీత౯నముచేత విషాపహరణ మంత్రంబున సర్పదష్టుండువోలె గన్నులందెరచి స్పృహతో నన్నుఁ జూచుచు నెవ్వరక్కడనని బరిజనమును బిలిచినది అప్పుడు పెక్కండ్రు జవరాండ్రు ఏమియాజ్ఞ అని పరిగెత్తుకొని వచ్చిరి. వారియందుఁ జూపుల వ్యాపింపఁజేయుచు మరకతశిలాతలమున గూర్చుండి నాకిట్లనియె.

పత్రలేఖా! ఇది ప్రియమని చెప్పుట కాదు. నీరాక జూచుచుఁ బ్రాణముల ధరించియుండెదను. శీఘ్రముగాఁగార్యము సాధించుకొని రమ్మని పలుకుచు నాహారము నామెడలోవైచి తాంబూలాంబరా భరణాదు లొసంగి నన్నుఁ బంపినది. అని చెప్ప పత్రలేఖ యించుక తల వంచుకొని వెండియు నిట్లనియె.

దేవ! సూతనమగు కాదంబరీ ప్రసాదాతిశయంబునం గలిగిన ప్రాగల్భ్యముచేత దుఃఖించుచు విజ్ఞాపన జేయుచున్నదాన. దేవరకు సైతమట్టి యవస్థలోనున్న గంధర్వరాజపుత్రిక నుపేక్షించి వచ్చుట యుచితముకాదు. ఆసన్నవత్సలులగు మీరు తగనికార్యము జేసితిరి. అని యాక్షేపించుటయుఁ జంద్రాపీడుఁడు లలితమైనను బ్రౌఢమైన తదాలాప మాలించి రెప్పవేయక ఇంచుక యాలోచించి బాష్పోపప్రుత నేత్రుఁడై స్వభావధీరుండైనను వ్యాకుల చిత్తుండై బాష్పవిక్షేపంబునం వ్యాకులమైన యక్షరములు గలుగునట్టుగాఁ బెద్ద యెలుంగున నిట్లనియె.

పత్రలేఖా! నేనేమిజేయుదును? శృంగారలీలల నుపదేశించెడు చెడుగు సచ్చవిల్తునమూలమున నామచ్చెకంటి తన హృదయంబునఁ బొడమిన వికారముల నాకుఁ దెల్లముగా నివేదించినది కాదు. దేవతా స్త్రీలయొక్క రూపానురూప లీలా సంభావనాధుల దృష్ట పూర్వము