పుట:Kashi-Majili-Kathalu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

108

కాదంబరి


శిఖరములచేఁ గేతకీదళములఁ వ్రాసి యంతలో జించివైచి తెగువమై సిగ్గుదిగద్రోచి తలయెత్తి యత్తన్వి సారెసారెకుఁ గన్నులప్పళించుచు నా కిట్లనియె.

సఖీ! పత్రలేఖా! నిన్నుఁ జూచినదిమొదలు నా హృదయము వయస్యలందరికన్న నీయందు విశ్వాసము గలిగియున్నది. కారణ మేమియో తెలియదు. బోఁటీ! నాపరిభవ మెవ్వరితోఁ జెప్పుకొందును? నా దుఃఖము పంచుకొని యనుభవించువారెవ్వరు? ఇప్పుడు నా ప్రాణసంకట మెఱిగింప నీకన్న నాకాప్తులు గనంబడలేదు. కాంతా! నాసంతాపమంతయు నీ కెఱింగించి జీవితము విడుచుచున్నదాన, నిష్కళంకమైన కులము కలంకపరచి కులక్రమాగతమగు సిబ్బితి మబ్బుచేసి సామాన్యకన్యవలె నాబోటి బోఁటి చిత్త చాంచల్యమందఁ దగినదా! అన్నన్నా! అనాధవలె నీచవలెఁ బలాత్కారముగాఁ జంద్రాపీడుని కారణంబున నిందాపాత్రురాలనయితినే! అయ్యో! గొప్పవారికిట్లు చేయుట దగునేమో చెప్పుము. పరిచయమున కిదియా ఫలము అభినవబిస సుకుమారమగు నామనం బతండిట్లు పరిభవింప వచ్చునా? కటకటా! యూనులకుఁ గుమారికాజనము పరిభవింపఁ దగినదే? సఖీ! నాహృదయము దహించుచున్నది. ఇఁక నేను బ్రతుకజాలను. జన్మాంతరమందైన నీసాంగత్యమే కోరుచున్నదాన. నీవంటి వయస్య నాకులేదు. నాకళంకమును ప్రాణపరిత్యాగ ప్రాయశ్చిత్తంబునఁ గడిగికొనియెదనని పలికి యూరకుండెను.

అప్పుడు నేనవ్విధమేమియు నెఱుఁగమింజేసి మిక్కిలి భయపడుచు విషాదముగా నిట్లంటి.

దేవీ! చంద్రాపీడుఁడేమి యపరాధము జేసెను? కుసుమ కోమలమగు నీమనంబు నేయవినయమున ఖేదపెట్టెను? వినుటకిచ్చ యించుచున్నదాన వడిగాఁజెప్పుము? విని మొదట నేను మేనుబాసిన