పుట:Kashi-Majili-Kathalu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

కాదంబరి


డతర్కితుండై రాజనగరిఁ బ్రవేశించెను.

అప్పుడు ద్వారపాలు రతని వాత౯ఱేనికి సహమహమికఁగాఁ బోయిచెప్పిరి. యీ వృత్తాంతము విని తారాపీడుఁడు పట్టరాని సంతోషముతో నతనికిఁ గొంతదూర మెదురేగెను.

చంద్రాపీడుఁడును దూరమునందే తండ్రిం జూచి తురగమును దిగి యతని పాదంబుల సాష్టాంగముగా బడిఁ నమస్కరించెను.

అతండు పుత్రకుని గ్రుచ్చియెత్తి గాఢముగా గౌఁగలించుకొనుచు నప్పుడే విలాసవతీ భవనమునకుఁ దీసికొనిపోయెను.

ఆమెయుఁ బుత్రునింజూచి యపార సంతోషముతో వదనము వికసింప నాలింగనము చేసుకొని యాత్రామంగళములు దీర్చుచు దిగ్విజయ యాత్రా సంబద్ధములగు కథలచేఁ బెద్దతడవందుంచుకొనియెను.

చంద్రాపీడుఁడు పిమ్మట శుకనాసున యింటికిఁబోయి వైశంపాయనుండు స్కంథావారముతో వచ్చుచున్నాడని చెప్పి, మనోరమకుఁ,బ్రీతి గలుగఁజేసి యాదివసమంతయుఁ తల్లియొద్దనేయుండి మరునాఁడు తనదగు కుమారభవనమునకుఁ బోయెను.

అతి మనోహరమగు నమ్మందిరము కాదంబరీ వియోగ చింతా సంతాపంబునఁ దొట్రుపడుచున్న యక్కుమారుని హృదయమునకు శూన్యంబువలె దోచినది.

అట్టి పరితాపముతో నతండు గొన్నిదినములు గడిపినంత నొకనాఁడు మేఘ నాధునితోఁ గూడ పత్రలేఖ హేమకూటము నుండి వచ్చుటయు దూరమునంద చూచి మోము వికసింప నమస్కరింపుచున్న దాని గ్రుచ్చియెత్తి మిక్కిలి గారవింపుచు నించుబోణి! కాదంబరీ మహాశ్వేతలు సుఖులేకదా యని యడిగిన నప్పడఁతియు వారి యనామయము జెప్పి, వెండియుం గాదంబరి తమసేమ మడిగినదని వక్కాణించెను.