పుట:Kashi-Majili-Kathalu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి కథ

101


గూర్చుండఁబెట్టుకొని వైశంపాయనుని స్కంధావారమున నుండ నియమించి వేరొక గుఱ్ఱమెక్కి కేయూరకుండు వెంటరా నాహయంబెక్కి యతిరయంబున నాహేమకూటమున కరిఁగి కాదంబరీ భవనద్వారంబున గుఱ్ఱమునుదిగి పత్రలేఖవెంట నడువ లోపలకుఁ బోవుచు నెదురుగా వచ్చుచున్న మఱియొక గంధర్వకుమారునిఁ గాదంబరి యెందున్నదని యడిగెను.

అతఁడు నమస్కరించుచు దేవా! క్రీడాపర్వతము క్రిందుభాగమునఁ గమలవనదీర్ఘికాతీరంబున రంచిపఁబడిన హిమగృహంబున వసించియున్నదని యెఱింగించెను. ఆమాటవిని కేయూరకుఁడు ముందు నడుచుచు మాగ౯ము దెలుపఁ బ్రమదవనము నడుమనుండి పోవుచు నందలి కదళీవన ప్రభలచే రవి కిరణంబులు పచ్చనగుట వింతగాఁ జూచుచు నవ్వనమధ్యంబున నళినీదళములచేఁ గప్పఁబడిన హిమసదనంబుచెంత కరిగెను.

సీ. లలితమృణాళదండములును బిసతంతు
               మయములై యొప్పుచామరలఁ బూని
   కదళీదళంబులు కమలినీ పత్రముల్
               బూలగుత్తులు ఛత్రములుగఁ బట్టి
   మలయజరసముతో మెలసి మర్దించిన
               కర్పూరధూళి పంకంబుదాల్చి
   తతకేతకీగర్భ దళదీపిత తమాల
               కిసలయ మాలికల్ కేలబూని

గీ. చెలులు శైత్యోపచారముల్సేయుచుండ
   హిమగృహంబునఁ బుష్పతల్పమునఁ బండుఁ
   కొని దురంత వియోగ వేదన దపించు
   చిత్రరధపుత్రిఁగాంచె నాక్షితిపసుతుఁడు